ఒక్క అప్డేట్ తో అందరికి క్లారిటీ ఇచ్చిన మహేష్...!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఐదు నెలల గ్యాప్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన మహేష్.. కరోనా లాక్ డౌన్ కారణంగా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయలేకపోయాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో హీరోయిన్ విషయంలో అనేకమంది తెరపైకి వచ్చారు. తాజాగా సస్పెన్స్ కు తెర దించుతూ చిత్ర యూనిట్ హీరోయిన్ ని ప్రకటించింది. నేడు జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ.. మహేష్ కి జోడీగా నటించనుందని ప్రకటించారు. ఈ సాలిడ్ అప్డేట్ తో కీర్తి 'సర్కారు వారి పాట'లో నటించడం లేదని వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.

కాగా మహేష్ బర్త్ డే కి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత చిత్ర యూనిట్ సైలెంట్ అయింది. దసరా తర్వాత సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుందని.. ముందుగా అమెరికాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని వార్తలు వచ్చాయి. అయితే నటీనటులు మరియు సిబ్బందికి వీసా ప్రాసెస్ కి సమయం పడుతుండటంతో సినిమా షూటింగ్ మరింత లేట్ కానుంది. దీంతో మహేష్ సినిమా స్టార్ట్ అవుతుందని తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్.. నిరుత్సాహపడ్డాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో 'మహానటి' కీర్తి సురేష్ నటిస్తుందని అనౌన్స్ చేసి వారందరిని ఖుషీ చేశాడు మహేష్. ఇలా ఒక అప్డేట్ తో సినిమాపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టడంతో పాటు ఫ్యాన్స్ ని కూడా సంతోషపెట్టారు.

మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. డైరెక్టర్ పరశురామ్ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేసాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మహేష్ ప్రీ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విశేషమైన స్పందన తెచ్చుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇటీవలే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్  చేసినట్లు వెల్లడించాడు. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న 'సర్కారు వారి పాట' వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 
× RELATED అభిమానులను నిరాశపర్చిన అసిన్
×