అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారీ ఆమె అంతరిక్షం నుంచే ఓటేస్తారు

అమెరికాలోని కోట్లాది మంది ఓటర్లకు ఆమె కాస్త భిన్నం. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే వీలుంది. అదే సమయంలో ఆమెకు ఉంది. కాకుంటే.. మిగిలిన వారందరికి భిన్నంగా ఆమె అంతరిక్షం నుంచి ఓటు వేయనున్నారు. తనకున్న ఓటుహక్కును ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావటానికి ససేమిరా అనే ఆమె ఎవరో కాదు.. వ్యోమోగామి కేట్ రూబిన్స్.

కేట్ పూర్తి పేరు కేథ్లీన్ హ్యాలసీ కేట్ రూబిన్స్. నాసాలో వ్యోమగామిగా పని చేసే ఆమె.. పుట్టింది కాలిఫోర్నియాలో. ఉంటున్నది టెక్సాస్ లో. పదో తరగతి చదివే సమయంలోనే అంతరిక్షంలో వెళ్లేందుకు అవసరమైన డబ్బుల కోసం ఇంటి చుట్టుపక్కల పని చేసేందుకు వెనుకాడేది కాదు. ప్రస్తుం 41 ఏళ్ల కేట్ తన 30 ఏటలో నాసాలో చేరారు. ప్రపంచంలో అంతరిక్షంలోకి అడుగు పెట్టిన 60వ మహిళగా ఆమె ఉన్నారు. ఆమె తర్వాత మరో ఐదుగురు మహిళలు అంతరిక్షంలో చేరుకొని పని చేస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేట్ గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ అంతరిక్షంలోనే ఉన్నారు. వాస్తవానికి ఆమె భూమికి తిరిగి వచ్చిన నాలుగు రోజులకు అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అయినప్పటికీ ముందుస్తుగా ఆమె తన ఓటును వేసేశారు. మళ్లీ భూమి మీదకు వచ్చిన ఆమె.. అక్టోబరు మధ్యలో అంతరిక్షానికి వెళ్లనున్నారు. దీంతో.. ఈసారీ ఆమె అంతరిక్షం నుంచే అధ్యక్షపదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరికి ఓటు వేయనున్నారు.

తాను ఎవరికి ఓటు వేసిన విషయాన్ని ఆమె వెల్లడించలేదు. కాకుంటే.. తన ఓటుహక్కును మాత్రం తప్పనిసరిగా వినియోగించుకుంటానని మాత్రం ఆమె స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఏడాది తిరిగి వచ్చే ఆమె.. అంతరిక్షం నుంచి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్నారు. ఆమె వేసే ఒక్క ఓటుతోనే అధ్యక్ష ఎన్నికల ఫలితంలో తేడా రాకపోవచ్చు. కానీ.. తన ఓటుహక్కును వినియోగించటానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంతన్నది ఆమెను చూస్తేనే తెలుస్తుంది. మనల్ని పాలించే వారిని ఎన్నుకోవటానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆమెను చూసైనా.. ఓటును లైట్ తీసుకునే మనోళ్ల మైండ్ సెట్ మారితే బాగుండన్న అభిప్రాయం కలుగక మానదు.
× RELATED కిడ్నాపర్ కోసం రైలునే ఆపలేదు!
×