తొమ్మిది నెలలు.. 10లక్షల మంది ప్రాణాల్ని తీసిన మహమ్మారి

ఎక్కడో అల్లంత దూరాన చైనాలోని వూహాన్ మహానగరంలో బయటకొచ్చిన కోవిడ్ -19 వైరస్ చూస్తుండగానే ప్రపంచం మొత్తం వ్యాపింపచేయటమే కాదు.. పది లక్షలకు పైనే అమాయక ప్రజల ప్రాణాల్ని తీసేసింది. కంటికి కనిపించని ఈ మహమ్మారి బారిన పడిన వారు భారీగా ఉంటే.. దానితో యుద్ధం చేయలేక ప్రాణాల్ని విడిచిన వారు మిలియన్ దాటిపోవటం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ఈ వైరస్.. రానున్న రోజుల్లో మరెన్ని ప్రాణాల్ని తీస్తుందన్నది ప్రశ్న.

భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి పదకొండున్నర గంటల సమయానికి కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య పది లక్షల 587 మందిగా తేలింది. రోజులు గడుస్తున్నకొద్దీ వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుందే తప్పించి తగ్గని దుస్థితి. కాకుంటే.. మొదట్లో పోలిస్తే.. ఇప్పుడు మరణాల రేటు కాస్త తగ్గినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు చెప్పిన పది లక్షల కేసులు అధికారికంగానే. అనధికారికంగా ఇంకెంతమంది ఉంటారన్నది ఒక ప్రశ్న అయితే.. కరోనా వచ్చి తగ్గిపోయిన నెల రోజులు.. అంతకంటే తక్కువ వ్యవధిలో ప్రాణాలు పోయిన వారిని ఈ జాబితాలో చేర్చలేదు.

గత ఏడాది డిసెంబరులో వూహాన్ లో ఈ వైరస్ జాడలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరి చివరి నాటికి ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈ మొత్తం మరణాల్లో సగం ఐదు దేశాల్లోనే ఉండటం గమనార్హం. మొత్తం కరోనా మరణాల్లో 20 శాతం అమెరికాలోనే ఉండటం గమనార్హం. అగ్రరాజ్యంలో కరోనా కారణంగా 2.09లక్షల మంది ప్రాణాలు కోల్పోతే.. రెండో స్థానంలో బ్రెజిల్ నిలిచింది. ఆ దేశంలో 1.41లక్షల మంది మరణించారు. మూడో స్థానంలో భారత్ నిలిచింది. ఇప్పటివరకు దీని కారణంగా 94.5 వేల మంది మరణించారు. నాలుగో స్థానంలో మెక్సికో.. ఐదో స్థానంలో బ్రిటన్ నిలిచింది.

నమోదైన కేసుల్లో మరణించిన వారి రేటు విషయానికి వస్తే.. అత్యధికంగా మెక్సికో నిలుస్తుంది. అక్కడ 10.5 శాతం ఉండగా.. తర్వాతి స్థానం బ్రిటన్ గా చెప్పాలి. అక్కడ నమోదైన కేసుల్లో 9.78 శాతం మంది మరణించారు. బ్రెజిల్ లో 2.99 శాతం ఉంటే.. అమరికాలో ఇది 2.87 శాతంగా ఉంది. అతి తక్కువగా భారత్ లోనే ఉంది. మన దేశంలో మరణాల రేటు 1.58శాతమని చెబుతున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికి వివిధ దేశాలు చేపడుతున్న చర్యల కారణంగా మరణాలు రేటు తగ్గుముఖం పట్టటం ఉపశమనాన్ని కలిగిస్తోంది.

మరణాలు విషయానికి వస్తే.. తొలి మూడు నెలల్లో లక్ష మంది మరణించారు. ఏప్రిల్ 9 నాటికి ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది మరణిస్తే.. అదే నెల 24 నాటికి రెండో లక్ష మంది మరణించారు. అంటే కేవలం.. 15 రోజుల్లోనే లక్ష మంది ప్రాణాల్ని ఈ వైరస్ తీసింది. మూడో లక్ష మరణాలకు మే 13 వరకు పట్టింది. నాలుగో లక్షకు జూన్ 4.. ఐదో లక్షకు అదే నెల 25నాటికి చేరుకున్నాయి. జులై 16 నాటికి ఆరో లక్ష.. ఆగస్టు 3 నాటికి ఏడో లక్ష.. అదే నెల 20 నాటికి ఎనిమిదో లక్ష మరణాలు సంభవించాయి. సెప్టెంబరు 8 నాటికి తొమ్మిదో లక్ష మరణాలు చోటు చేసుకుంటే.. ఈ నెల 27నాటికి పదో లక్ష మరణాలు చోటు చేసుకున్నాయి.
× RELATED కిడ్నాపర్ కోసం రైలునే ఆపలేదు!
×