ఆలస్యం అయినా ఆగకుండా సర్కారు వారి పాట..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ కోసం అభిమానులు మరియు సినీ వర్గాల వారు అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సమ్మర్ లో తదుపరి సినిమా ప్రారంభించాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ ఏడాది చివరి నుండి పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మొదలు అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కాని సినిమా డేట్స్ విషయంలో మహేష్ బాబు చాలా పక్కాగా ఉన్నాడట.

సర్కారు వారి పాట సినిమాను జనవరి మూడవ లేదా నాల్గవ వారంలో ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో ఎలాంటి బ్రేక్ లు లేకుండా సినిమాను చేయాలని భావిస్తున్నారట. ఇండియాలో పలు ప్రాంతాలతో పాటు అమెరికాలో కూడా ఈ సినిమాను షూటింగ్ చేయబోతున్నారు. వచ్చే సమ్మర్ లో అమెరికాలో షూటింగ్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇండియాలో మరియు అమెరికాలో ఏకధాటిగా షూటింగ్ ను జరిపి జూన్ చివరి వరకు షూటింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయించారు.

జూన్ లో షూటింగ్ ను పూర్తి చేసిన యూనిట్ సభ్యులు ఆగస్టులో మంచి టైం చూసి విడుదల చేయాలని ప్లాన్ చేశారట. మొత్తానికి వచ్చే దసరా సీజన్ కంటే ముందే సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసింది. నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపిక అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆవిషయమై అధికారికంగా క్లారిటీ రాలేదు. కనుక మళ్లీ నిర్ణయం ఏమైనా మారేనా అనేది చూడాలి. ఇక సర్కారు వారి పాట సినిమా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలు మరియు అవినీతిపై ఉంటుందని ఇప్పటికే మోషన్ పోస్టర్ మరియు ప్రీ లుక్ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
× RELATED ప్రముఖ నటుడి విడాకులపై అతడి అత్త క్లారిటీ?
×