సంక్రాంతి బరిలో నిలిచే హీరోలు...?

తెలుగు సినిమాలకు సంక్రాంతిని మించిన సీజన్ మరొకటి ఉండదు. సంక్రాంతి బరిలో మూడు నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలైనా కలెక్షన్లకు ఢోకా ఉండదని భావిస్తుంటారు. అందుకే ఫిలిం మేకర్స్ అందరూ ఫెస్టివల్ సీజన్ డేట్స్ ని లాక్ చేసుకోడానికి పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో పొంగల్ ని టార్గెట్ గా పెట్టుకొని దానికి తగ్గట్టుగా సినిమాలను రెడీ చేస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతి రేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో'.. రజినీకాంత్ 'దర్బార్'.. కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' సినిమాలు నిలిచాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా రెండు భారీ సినిమాలు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా కరోనా మహమ్మారి కారణంగా ఆరున్నర నెలలుగా థియేటర్స్ మూతబడిపోయి ఉన్నాయి. దీంతో సినిమాలన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే థియేటర్స్ ఓపెన్ చేసి జనాలు ఒకప్పటిలా రావడానికి జనవరి వరకు సమయం పట్టేలా ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన పెద్ద సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. వాటిల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమా కూడా ఉండే అవకాశం ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు - బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'వకీల్ సాబ్' మిగతా చిత్రీకరణ త్వరలోనే పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్న మరో పెద్ద సినిమా 'కేజీఎఫ్ చాప్టర్ 2' అని చెప్పవచ్చు. రాకింగ్ స్టార్ యష్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'కేజీఎఫ్' సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. సీక్వెల్ పై భారీ అంచనాలే ఏర్పడ్డయి. అందుకే చాప్టర్ 2ని మొదటి భాగాన్ని మించి రెడీ చేస్తున్నారు. ముందుగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడేలా కనిపించడం లేదు. దీంతో కన్నడ బాహుబలి గా పిలవబడుతున్న 'కేజీఎఫ్ 2' కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. ఇక రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమాని కూడా అప్పుడే రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారట. ఓటీటీలు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తున్నా రిజెక్ట్ చేస్తూ థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న 'రెడ్' విడుదలపై త్వరలోనే క్లారిటీ రానుందు.

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాని సంక్రాంతి కానుకగా తీసుకొస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు - వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఇక మరో అక్కినేని వారసుడు నాగ చైతన్య నటించిన ''లవ్ స్టోరీ'' సినిమాని కూడా ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ''క్రాక్'' సినిమా కూడా రేస్ లో నిలిచే అవకాశాలు లేకపోలేదు. మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కావొచ్చింది. నితిన్ 'రంగ్ దే' సినిమాని కూడా పొంగల్ కి తీసుకొస్తామని ఇంతకముందు ప్రకటించారు. కానీ ఈ మధ్య ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందు. మరి చివరికి ఈ సినిమాల్లో సంక్రాంతి పోటీలో ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.
× RELATED ప్రముఖ నటుడి విడాకులపై అతడి అత్త క్లారిటీ?
×