సెట్ టాప్ బాక్సుల స్కాం.. బాబు ఫ్యామిలీకి చుట్టుకోనుందా?

ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు మరిన్ని కష్టాలు తప్పేట్లుగా లేవని చెప్పాలి. ఇప్పటికే సొంత పార్టీ నేతలు ఇస్తున్న షాకులు సరిపోనట్లుగా.. తమ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై లోతుగా విచారణ జరుపుతున్న తీరు.. ఈ సందర్భంగా బయటకు వెల్లడవుతున్న వాస్తవాలు సంచలనంగా మారుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. సెట్ టాప్ బాక్సుల కొనుగోలు సందర్భంగా భారీ అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్ లో జరిగిన అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ.. టీడీపీ హయాం లో ఐటీ విభాగం సలహారుగా వ్యవహరించిన వేమూరి హరికృష్ణప్రసాద్ కు సవాలు విసిరారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ బిజినెస్ ఆపరేషన్స్ మాజీ ఈడీ గౌరీ శంకర్. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు లో రూ.1500 కోట్ల బిల్లుల్ని చెల్లిస్తే.. ఆ మొత్తంలో 80 శాతం వేమూరి హరికృష్ణ ప్రసాద్ కు చెందిన టెరాసాఫ్ట్.. నెట్ ఇండియా.. నెటాప్స్ సంస్థల ఖాతాల్లోకే వెళ్లినట్లు గా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. సెట్ టాప్ బాక్స్ ల కొనుగోళ్లలోనూ భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా చెప్పటమే కాదు.. అందుకు సంబంధించిన ఆధారాల్ని బయట పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక్కొక్క సెట్ టాప్ బాక్సును రూ.4400 చొప్పున 12 లక్షల బాక్సులు కొనుగోలు చేశారని చెప్పారు. ఇంతా చేస్తే.. కేవలం 8 లక్షల బాక్సులే పని చేస్తున్నాయని.. బహిరంగ మార్కెట్ లో రూ.2వేలకు మించని బాక్సును ఇంత భారీ ధరకు ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ల నుంచి నెలకు రూ.11 కోట్ల బిల్లులు వసూలు కావాల్సి ఉంటే.. టెరా సాఫ్ట్ మాత్రం రూ.7 కోట్లు మాత్రమే వసూలు అయినట్లుగా చూపించారని.. తక్కువ బిల్లింగ్ చూపిస్తూ.. రూ.70 కోట్లకు పైనే దోపిడీ చేసినట్లు గా ఆరోపించారు. ఈ తీరులో పెద్ద ఎత్తున వినిపిస్తున్న ఆరోపణలు మొత్తం చివరకు చినబాబు వద్దకు వచ్చి ఆగుతున్నట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. రోజులు గడిచే కొద్దీ..బాబుకు కొత్త తిప్పలు అంతకంతకూ ఎక్కువ కావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.
× RELATED కిడ్నాపర్ కోసం రైలునే ఆపలేదు!
×