శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు.. మరో ముగ్గురు సెలబ్రిటీలకు నోటీసులు

సంచలనంగా మారిన శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే పలువురు నటీమణులు ఈ కేసులో అరెస్టు కావటం తెలిసిందే. డ్రగ్స్ దందాపై గతంలో ఎంతో మందిపై ఆరోపణలు రావటం..  విచారణలు జరిగినా.. కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన ఉదంతాలు మాత్రం ఇటీవల కాలంలోనే చోటు చేసుకుంటున్నాయి. అటు బాలీవుడ్ లో రియా చక్రవర్తి.. తాజాగా శాండల్ వుడ్ లో పలువురు ప్రముఖులు అరెస్టు అయ్యారు.

ఇదిలా ఉంటే.. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్న వారి లెక్క తేల్చేందుకు కొత్త మార్గంలో పయనిస్తున్నారు. రేవ్ పార్టీలు ఎక్కడెక్కడ జరిగాయి? వాటికి హాజరైన ప్రముఖులు ఎవరున్నారు? క్లబ్బులు.. పబ్ లకు తరచూ హాజరయ్యే సెలబ్రిటీలు ఎవరన్న విషయంపై ఇప్పటికే సమాచారం సేకరించిన పోలీసులు.. వారి మేనేజర్లు.. సహాయకుల ద్వారా వివరాల్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. త్వరలోనే మరికొందరు ప్రముఖుల్ని సైతం అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. తాజాగా ఈ కేసులో నటుడు కమ్ యాంకర్ అకుల్ బాలాజీ తో పాటు.. మాజీ ఎమ్మెల్యే ఆర్ వీ దేవరాజ్.. మరో నటుడు సంతోష్ కుమార్ లకు నోటీసులు ఇచ్చారు. వారిని విచారణకు హాజరు కావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది రోజుల్లో మరింతమందికి తిప్పలు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది.
× RELATED పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం కొనసాగిస్తారా...?
×