అనుకున్నదే అయ్యింది..రేపటి నుంచి అమెరికాలో టిక్ టాక్ బ్యాన్!

మొత్తానికి అనుకున్నదే అయింది. అమెరికాలో రేపట్నుంచి టిక్ టాక్ వీ చాట్ యాప్ లపై నిషేధం అమల్లోకి రానుంది. తమ పౌరుల వ్యక్తిగత డేటా సంగ్రహిస్తున్నాయని భారత్ చైనాకు చెందిన టిక్ టాక్ వీ చాట్ షేర్ ఇట్ పబ్ జీ  వంటి పలు యాప్ లను నిషేధించింది. కరోనా వైరస్ పుట్టుకకు  చైనానే  కారణమని అమెరికా మండిపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే ఏకంగా కరోనా ను చైనీస్ వైరస్.. చైనీస్ వైరస్ అంటూ పలు మార్లు  సంబోధించారు. చైనా కారణంగానే ప్రస్తుతం ఈ దుస్థితి తలెత్తిందని ట్రంప్ ఆ దేశంపై ఆగ్రహంతో ఉన్నాడు.

చైనా యాప్స్ ని భారత్ నిషేధించిన నేపథ్యంలో అమెరికా కూడా భద్రతా పరమైన కారణాలతో టిక్ టాక్ ని బ్యాన్ చేస్తున్నట్లు ట్రంప్ కొద్ది రోజుల కిందట  ప్రకటించారు. టిక్ టాక్ యూఎస్ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కు  విక్రయిస్తే దాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇస్తామని అందుకు 45రోజులు గడువు ఇస్తూ ఆగస్టు 7న ఉత్తర్వులు జారీ చేశారు.

టిక్ టాక్ విక్రయంపై ఐటీ దిగ్గజం  మైక్రోసాఫ్ట్ తో జరిపిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ ఒరాకిల్ సంస్థతో టిక్ టాక్ అమ్మకంపై చర్చలు జరిపింది. అవి ఓ కొలిక్కి రాక  పోవడం ఇచ్చిన 45 రోజుల గడువు పూర్తవడంతో టిక్ టాక్ పై అమెరికా నిషేధం విధించింది. తమ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందన్న   అనుమానాలు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టిక్ టాక్ వీ చాట్ లను రేపటి నుంచి నిషేధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య విభాగం కార్యదర్శి విల్ బర్ రోస్ తెలిపారు. ఒకవేళ టిక్ టాక్ యాజమాన్యం మార్పిడి చేసుకుంటే నిషేధం ఎత్తివేసిన అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
× RELATED మెహబూబాకు నిరసనల సెగ...షాకిచ్చిన సొంత పార్టీ నేతలు
×