అప్పుల కుప్ప.. కేంద్రం వంద లక్షల కోట్ల అప్పా?

కాదెవరు అప్పు తీసుకోవడానికి అనర్హం అన్నట్టు కరోనా చేసింది. సీఈవోల నుంచి చీఫ్ సబ్ ఎడిటర్ల దాకా.. అంబానీలాంటి పారిశ్రామిక వేత్తల నుంచి సామాన్యుల దాకా కరోనా వేళ కాచుకోవడానికి అప్పులు తీసుకున్న వారే.. బంగారం కుదువపెట్టి కొందరు.. ఇంకొన్ని అమ్ముకొని కొందరు.. స్నేహితులను అడుక్కొని ఇంకొందరు అప్పు పుట్టించిన వారే.. మరి అందరికీ పెద్దన్న కేంద్రం కూడా ఈ కరోనా వేళ అప్పు చేసింది.

అవును.. కేంద్రప్రభుత్వం కూడా అప్పు చేసింది. అదో పెద్ద కుప్పగానే ఉంది. కేంద్ర ప్రభుత్వ అప్పులు ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి రూ.101.3 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

మార్చి 31 నాటికి రూ.94.6 లక్షల కోట్లుగా ఉన్న అప్పు.. మహమ్మారి వల్ల గత మూడు నెలల్లోనే అదనంగా మరో 6.7 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల  అమలు కోసం ఈ అప్పు చేసినట్లు చెప్పింది. దీంతో మొత్తం `100 లక్షల కోట్లు దాటేసింది.

గత ఏడాది జూన్ చివరి నాటికి సర్కారీ అప్పుల భారం రూ.88.18 లక్షల కోట్లుగా ఉంది. ఇలా మనం వేలు లక్షల్లో అప్పు చేస్తే మన అందరినీ పాలించే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏకంగా వంద లక్షల కోట్లను అప్పు చేసింది. అప్పులు తీసుకోవడంలో అందరికంటే నేనే తోపు అని నిరూపించుకుంది.

ఇలా ఎంత చెట్టుకు అంత గాలి అంటే ఇదేనేమో..
× RELATED గేల్ వీర విధ్వంసం.. పంజాబ్ గ్రాండ్ విక్టరీ
×