ఏపీలో బీజేపీ త్రిపుర వ్యూహం అమలు చేస్తుంది : మంత్రి పేర్ని నాని !

ఏపీ దేవాలయాల్లో వరుసగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్వేది ఘటనలో రధం దగ్దం కావడానికి ముందు పలు దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ప్రభుత్వం వాటిని సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో తాజాగా అంతర్వేది ఘటన తర్వాత సీబీఐ దర్యాప్తు వరకూ వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఘటనల వెనుక కారణం బీజేపీయే అని ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది.

రాష్ట్రంలో దేవాలయాల్లో జరుగుతున్న వరుస ఘటనల వెనుక బీజేపీయే ఉందని ఏపీ మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో త్రిపురలోనూ కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలే జరిగాయని ఆ తర్వాత అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందని రవాణామంత్రి పేర్నినాని తెలిపారు. అలాగే అప్పట్లో అక్కడ బీజేపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న సునీల్ దియోధర్ ఇప్పుడు ఏపీ ఇన్ ఛార్జ్ గా ఉన్నారని ఆయన తెలిపారు. దీనితో త్రిపుర మోడల్ ను బీజేపీ ఏపీలోనూ అమలు చేస్తోందనే భావన ఉందని అన్నారు. గతంలో త్రిపురలో బీజేపీ హిందూ ఓట్లను సమీకరించడం ద్వారా అధికారంలోకి వచ్చిందని కానీ దోషులను మాత్రం ఇప్పటివరకూ పట్టుకోలేకపోయిందని ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతున్నట్లు ఉందన్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి అంటూ పేర్నినాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×