మోడీతో పోలవరం బంధం.. జగన్ వ్యూహం సక్సెస్!

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో.. ఎక్కడ ఎలాంటి పాచిక వేయాలో తెలియక పోతే.. కష్టమే!  ఎంత సీనియర్ అయినా.. ఎన్ని కొమ్ములున్నా.. నాయకులు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలియకపోతే.. ఇబ్బందులే!! ఈ విషయం ఎందుకు ప్రస్థావన వస్తోందంటే.. గడిచిన ఐదేళ్ల పాలనలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సాధించలేనిది.. కేవలం ఏడాదిన్న పాలనలో వైసీపీ అధినేత రాజకీయంగా ముక్కుపచ్చలారని జగన్ సాధించడమే!

చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో పోలవరం సాగునీటి ప్రాజెక్టును రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడ్డారు. ప్రతి సోమవారాన్ని.. పోలవారంగా మార్చుకుని సమీక్షలు.. సమావేశాలు.. పర్యటనలు.. అంటూ హడావుడి చేశారు. అనుకూల మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు రాయించుకున్నారు. ఇంకేముంది.. మా వ్యూహంతో 2018 చివరి నాటికే నీటిని ఇచ్చేస్తామని ప్రకటనలు గుప్పించారు. అయితే అధికారం నుంచి దిగిపోయేనాటికి చుక్క నీటిని ఇవ్వలేక పోయారు.

దీనికి కారణం.. నిధుల సమస్యే! కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడం ఈ విషయంలో కేంద్రం అడిగిన లెక్కలు చెప్పకపోవడం.. వంటి పరిణామాలతో చంద్రబాబు రాజకీయంగా పోలవరం విషయంలో పిల్లిమొగ్గలు వేయాల్సి వచ్చింది. ఇక జగన్ విషయాన్ని చూస్తే.. ఎక్కడా ఆరాటం లేదు. ఎక్కడా ఆర్భాటం లేదు. రోజుల తరబడి సమీక్షలు.. వాటికి ప్రచారాలు అంతకన్నా లేవు. అయితే పనులు మాత్రం జరిగిపోతున్నాయి. ఎక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలో అక్కడ అదే వ్యూహాన్ని ప్లే చేస్తున్నారు.


ఫలితంగా పెండింగ్లో ఉన్న పూర్తి మొత్తం రూ.3 వేల కోట్లకు పైగా ఇచ్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు పచ్చ జెండా ఊపింది. మరి ఇది ఎలా సాధ్యమైంది? అంటే.. కేవలం వ్యూహం. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండడమేనని అంటున్నారు పరిశీలకులు. ఇక ఈ నిధులు విడుదలకు రంగం రెడీ అయిన నేపథ్యంలో ప్రాజెక్టు పుంజుకోవడం ఖాయం. అంతిమంగా అటు మోడీకి ఇటు జగన్కు కూడా పోలవరం లబ్ధి చూకూరుతుందనడంలో సందేహం లేదు. ఏదేమైనా.. ప్రచారం కన్నా.. పనికి ప్రాధాన్యం ఇస్తుండడం వల్లే ఇది సాధ్యమవుతోందని అంటున్నారు పరిశీలకులు. నిజమే కదా!!
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×