మోడీ ప్రభుత్వాన్ని కోర్టుకు లాగనున్న కేసీఆర్?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేంద్ర ప్రభుత్వంపై దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ఇటీవలి కాలంలో జీఎస్టీ చెల్లింపులు విద్యుత్ చట్టం వంటి అంశాలపై ఆగ్రహోద్రుడవుతున్నారు. జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో కేంద్రం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. జీఎస్టీ చట్టం ప్రకారం ఆదాయం తగ్గినప్పుడు రాష్ట్రాలకు కేంద్రం నష్టపరిహారం చెల్లించాలి. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి నేపథ్యంలో యాక్ట్ ఆఫ్ గాడ్గా చెప్పి రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్ ఇచ్చింది. ఆర్బీఐ నుండి అప్పులు తీసుకోవాలని సూచించింది.

దీనిపై కేసీఆర్ సహా బీజేపీయేతర ప్రభుత్వాలు గుర్రుగా ఉన్నాయి. జీఎస్టీకి సంబంధించి కేంద్రం తీసుకు వచ్చిన చట్టాన్ని పాటించాలని రాష్ట్రాలకు సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్. కరోనా కారణంగా జీఎస్టీ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ తమకు చెల్లింపులు జరపాల్సిందేనని బీజేపీయేతర ప్రభుత్వాలు అంటున్నారు. కేసీఆర్ తన వాదనను మరింత బలంగా వినిపిస్తున్నారు.

రుణాలు తీసుకోవడానికి కేంద్రం షరతులకు లోబడే ప్రసక్తి లేదని న్యాయపరంగా నిధులను పొందేందుకు పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. జీఎస్టీ చట్టంపై పూర్తిగా అధ్యయనం చేసి నిపుణులు న్యాయ నిపుణులతో చర్చల అనంతరం న్యాయస్థానంలో పిటిషన్ వేసే అవకాశాలు పరిశీలిస్తున్నారట. ఈ మేరకు తెరాస వర్గాలు చెబుతున్నాయని వార్తలు వస్తున్నాయి. తాను న్యాయపోరాటానికి ముందుకు సాగితే ఇతర రాష్ట్రాలు కలిసి వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారట. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు వెళ్లడం అనూహ్యం అవుతుంది.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×