పేలుడు ధాటికి ప్రభుత్వం దిగిపోయింది.. ఎందుకు?

లెబనాన్లోని బీరుట్లో వారం కిందట జరిగిన భారీ పేలుడు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన సంగతి తెలిసిందే. 200 కిలోమీటర్ల దూరం ఆ పేలుడు వినిపించడం గమనార్హం. వేల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యయి. పదుల కిలోమీటర్ల దూరం అనేక నిర్మాణాలు దెబ్బ తిన్నాయి. 200 మందికి పైగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా నాగసాకి మీద జరిగిన అణుబాంబు దాడిని ఈ ఉదంతం గుర్తు తెచ్చింది. బీరుట్ పోర్టులో ఆరేళ్లుగా నిల్వ ఉంచిన వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణంగా ఈ భారీ పేలుడు జరిగింది. ఇదిలా ఉండగా.. ఈ పేలుడు జరిగిన వారం రోజుల్లోపే అక్కడి ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవడం గమనార్హం.

ఈ భారీ పేలుళ్ల అనంతరం లెబనాన్లో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. పేలుడు ధాటికి సర్వం కోల్పోయిన అనేక రకాలుగా నష్టపోయిన ప్రజలు రోడ్ల మీదికి వచ్చి తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. అవి హింసాత్మకంగానూ మారాయి. ఈ దారుణానికి ప్రభుత్వ నిర్లక్ష్యం అవినీతే కారణమని.. అది దిగిపోవాల్సిందే అని ఆందోళన బాట పట్టారు. రోజు రోజుకూ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడం వాటిని అదుపు చేయలేని పరిస్థితి తలెత్తడంతో ప్రధాని హసన్ దియాబ్ రాజీనామా చేశారు. దేశంలో అవినీతి పతాక స్థాయికి చేరుకున్న మాట వాస్తవమని ఆయన అంగీకరించారు. ఐతే ఇందుకు ఆయన వ్యతిరేక వర్గాన్నే బాధ్యులు చేశారు. అయితే ఇలా ప్రజాగ్రహానికి జడిసి ఓ ప్రభుత్వం రాజీనామా చేయడం మాత్రం మంచి పరిణామంగా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. ప్రధాని రాజీనామాతో లెబానన్లో రాజకీయ సంక్షోభం నెలకొంటుందని అంచనా వేస్తున్నారు.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×