జగన్ స్పీడ్... మరో సంక్షేమ పథకానికి శ్రీకారం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ ప్రమాణం చేపట్టిన తర్వాత ఏపీలో సంక్షేమం కొత్త పుంతలు తొక్కుతోందనే చెప్పాలి. ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దాదాపుగా ఇప్పటికే మెజారిటీ పథకాలను పట్టాలెక్కించిన జగన్... ఇప్పుడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ‘జగనన్న చేయూత’ పేరిట బుధవారం ప్రారంభం కానున్న ఈ పథకం కింద రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన 45 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.18750 చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం చేయడమే ఈ పథకం ఉద్దేశం.

ఈ పథకాన్ని బుధవారం నాడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లుగా ఇటీవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మంగళవారం ప్రకటించారు. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు మధ్య ఉన్న మహిళలకు ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించనున్నదని మంత్రి తెలిపారు. బుధవారం ప్రారంభం కానున్న ఈ పథకాన్ని నాలుగేళ్ల పాటు కొనసాగించనున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించిన మహిళలకు ఏడాదికి రూ.18750లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని మంత్రి చెప్పారు. నాలుగేళ్లలో ఈ పథకం లబ్ధిదారుల్లో ఒక్కొక్కరికి మొత్తంగా రూ.75 వేల మేర లబ్ధి కలగనుందని ఆయన చెప్పారు.

రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే... టీడీపీ హయాంలో ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. జగన్ అధికారం చేపట్టేనాటికి ఖాళీ ఖజానా ఉందని అయినా కూడా సంక్షేమ పకథకాలకు ఎలాంటి ఆటంకం కలిగించని రీతిలో జగన్ పాలన సాగిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే మెజారిటీ పథకాలకు శ్రీకారం చుట్టేసిన జగన్... తాజాగా ఇప్పుడు జగనన్న చేయూతను కూడా ప్రారంభించనున్నారు. జగనన్న చేయూత కోసం తమ ప్రభుత్వం ఏకంగా రూ.4700 కోట్లను కేటాయించిందని వేణుగోపాల కృష్ణ తెలిపారు.
× RELATED పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్
×