వైసీపీ నాయకుడి లారీలో తెలంగాణ మద్యం రవాణా

ఏపీలో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అందుకని మద్యానికి భారీగా రేటు. అదే పక్కనున్న తెలంగాణలో మద్యం అందులో సగానికే దొరుకుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ మద్యం ఏపీలో ఏరులై పారుతోంది. మద్యాన్ని వ్యాపారంగా చాలా మంది భావించి గ్రామాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ప్రముఖ బ్రాండెడ్ మద్యం కూడా ఏపీలో దొరకకపోవడంతో తెలంగాణ నుంచి తీసుకొచ్చి భారీ రేటుకు అమ్ముకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నాయకుడికి చెందిన లారీలో తెలంగాణకు చెందిన మద్యం పట్టుబడడం కలకలం రేపింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు పూడిచర్ల మెట్ట జాతీయ రహదారి వద్ద మంగళవారం సోదాలు నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర పేరిట ఒక లారీలో అక్రమ మద్యం రవాణా అవుతున్నట్టు గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లారీ డ్రైవర్ క్లీనర్ ను విచారించగా ఆ లారీ సంజామాలకు చెందిన వైసీపీ నేత ఎం వెంకటసుబ్బారెడ్డిదిగా తేలింది. సుబ్బారెడ్డి లారీని తమకు అప్పగించి తెలంగాణలోని సంతోష్ అనే వ్యక్తి నుంచి మద్యం బాటిల్స్ తీసుకురావాలని సూచించారని లారీ డ్రైవర్ క్లీనర్ పోలీసులకు వివరించారు. సంతోష్ వెంకటసుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. వెంకటసుబ్బారెడ్డి సంజామల జడ్పీటీసీగా మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


× RELATED భట్టి వదిలేట్టు లేడుగా?.. డబుల్ బెడ్రూం మీద తాజాగా మరో షాక్
×