షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ఆత్మహత్య కేసులో షాకింగ్ నిజాలు

కాళ్ల పారాణి ఆరకముందే.. ఆ ఇంట తోరణాలు తీయకముందే.. సంబరాలు ముగియకముందే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలిచివేసింది. పెళ్లయిన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం వారింట విషాదాన్ని నింపింది. ఈ ఆత్మహత్య ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద సీతానగరానికి చెందిన మహాదాసు శ్రీను మంగ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. ఒక కొడుకు. డిగ్రీ చదువుతున్న పెద్ద కూతురు రమ్యశ్రీ(20)కి మూడు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణ ఈశ్వరం గ్రామానికి చెందిన ఆమె మేనమామతో వివాహం జరిపించారు.

ఆమెకు ఇష్టం లేకుండా కుటుంబ సభ్యులు బలవంతంగా పెళ్లి జరిపించినట్టు ఆరోపణలున్నాయి. పెళ్లైన అనంతరం మూడు రోజులకే పుట్టింటి వద్ద రమ్యశ్రీ ఆత్మహత్యయత్నం చేసింది. ఎలుకల మందు తిని అపస్మారక స్థితికి చేరగా.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మరణించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. రమ్యశ్రీకి షార్ట్ ఫిలింలు అంటే ఇష్టమని.. ఇటీవల ఓ షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా నటించినట్టు తెలుస్తోంది. ఈనెల 2న అది విడుదలకు ప్లాన్ చేశారు. ఇంతలోనే తల్లిదండ్రులు ఇష్టం లేకుండా పెళ్లి చేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో అసలు నిజాలు తేలాల్సి ఉంది.


× RELATED జగన్ కు షాక్... నిలిపిన వేతనాలు వడ్డీతో చెల్లించాల్సిందేనట
×