బీహార్ పోలీసులకు సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ నిరాకరించిన హాస్పిటల్ సిబ్బంది...!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జూన్ 14న చనిపోయిన సుశాంత్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ధ్రువీకరించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ సుశాంత్ ది సూసైడ్ అని చెప్పినప్పటికీ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సుశాంత్ సూసైడ్ పై అనేక అనుమానాలున్నాయని.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు. సుశాంత్ మరణంపై విచారణ చేస్తున్న ముంబై పోలీసులు ఇప్పటికే ఇండస్ట్రీలోని ప్రముఖులను అతనితో సన్నిహితంగా ఉండే వ్యక్తులను విచారించారు. ఈ క్రమంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీస్ స్టేషన్ లో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. దీంతో పాట్నా పోలీసులు రియాతో పాటు మరో ఐదుగురి మీద పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసుల బృందాన్ని ముంబైకి పంపించారు.

కాగా బీహార్ పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా బాంద్రాలోని కోటక్ మహేంద్ర బ్యాంక్ లో సుశాంత్ కి సంబంధించిన ఖాతా వివరాలు సేకరించారు. సుశాంత్ ఇంట్లో పని చేసే వారిని విచారించడంతో పాటు సుశాంత్ తో క్లోజ్ గా ఉండే వారిని కూడా ఎంక్వైరీ చేసారని సమాచారం. ఈ క్రమంలో సుశాంత్ సింగ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన ముంబైలోని కూపర్ ఆసుపత్రిని పోలీసులు సందర్శించారు. బీహార్ పోలీసు బృందం సుశాంత్ పోస్టుమార్టం నివేదిక ఇవ్వమని అడుగగా కూపర్ హాస్పిటల్ వారు తిరస్కరించినట్లు బీహార్ పోలీసు వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ కేసులో అనేక అనుమానాలు కలుగుతున్న తరుణంలో కూపర్ ఆసుపత్రి వారు సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించడం మరిన్ని డౌట్స్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ విషయంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించింది. ''ఇది ఈ రోజుకి అత్యంత భయంకరమైన వార్త'' అని ట్వీట్ చేసింది.


× RELATED సుశాంత్ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!
×