ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి సెలెక్ట్ అయిన కార్తీ సినిమా...!

కోలీవుడ్ హీరో కార్తీ నటించిన చిత్రం ''ఖైదీ''. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమాలో కార్తీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గతేడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బిడ్డ కోసం ఆరాటపడే ఓ ఖైదీ.. జైలు నుంచి విడుదలై తన కూతురును చూసేందుకు వెళ్లే క్రమంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ పేస్ చేసాడు అనే నేపథ్యంలో ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అందులోనూ ప్రయోగాత్మకంగా కేవలం ఒక్క రాత్రిలో జరిగిన సంఘటనలతో ఈ సినిమా రూపొందడం విశేషం. సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ''ఖైదీ''ని బాలీవుడ్ లో స్టార్ హీరో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నారు.

కాగా ''ఖైదీ'' సినిమా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శనకు సెలెక్ట్ అయింది. 'ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్ 2020' లో ఈ చిత్రం ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ట్వీట్ చేస్తూ.. ''ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి వర్క్ చేసిన వారందరికీ బిగ్ థ్యాంక్స్'' అని సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆగష్టు 9 నుంచి 15 వరకూ జరుగనుంది. ''ఖైదీ'' తోపాటు తెలుగు నుంచి నాని ''జెర్సీ'' మరియు హిందీ నుంచి హృతిక్ రోషన్ ''సూపర్ 30'' సినిమాలు కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికయ్యాయి.


× RELATED సుశాంత్ ను ప్రేమించా.. ఇప్పుడు బాధపడుతున్నా!
×