ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య

‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ రివ్యూ

నటీనటులు: సత్యదేవ్-రూప కొడువయూర్-హరిచందన-నరేష్-సుహాస్ తదితరులు
సంగీతం: బిజ్బల్
ఛాయాగ్రహణం: అప్పు ప్రభాకర్
కథ: శ్యామ్ పుష్కరన్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ-ప్రసాద్ దేవినేని-ప్రవీణ పరుచూరి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెంకటేష్ మహా

తొలి చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వెంకటేష్ మహా. రెండో సినిమాకు ఆశ్చర్యకరంగా అతను రీమేక్‌ ను ఎంచుకోవడం ఆశ్చర్యకరం. మలయాళంలో విజయవంతమైన ‘మహేషింతే ప్రతీకారం’ చిత్రాన్ని సత్యదేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’గా తెరకెక్కించాడు. బాహుబలి, కేరాఫ్ కంచరపాలెం నిర్మాతలు తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజే నేరుగా ‘నెట్‌ ఫ్లిక్స్’లో రిలీజైంది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: మహేష్ (సత్యదేవ్) అరకులో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చిన్న ఫొటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఫొటోగ్రాఫర్. ఏ గొడవల జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చేసుకోవడం.. అందరికీ చేదోడు వాదోడుగా ఉండటం.. తండ్రిని బాగా చూసుకోవడం.. ప్రేమించిన అమ్మాయితో కబుర్లు.. ఇలా అతడి జీవితం ప్రశాంతంగా సాగిపోతుంటుంది. అలాంటి సమయంలో అతడి జీవితంలో అలజడి రేగుతుంది. ప్రేమించిన అమ్మాయి దూరమవుతుంది. అదే సమయంలో తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి అవమానపడతాడు మహేష్. ఈ అవమానానికి అతనెలా ప్రతీకారం తీర్చుకున్నాడు.. ప్రేమ వైఫల్యం తర్వాత మళ్లీ ఎలా సాంత్వన పొందాడు.. జీవితాన్ని ఎలా చక్కదిద్దుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కథానాయకుడు ‘ఈ నేచర్లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ను డిసైడ్ చేస్తుంది’ అంటూ బటర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి వివరించే సన్నివేశం గుర్తుంది కదా. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో దాన్ని గుర్తుకు తెచ్చేలా ఓ ఆసక్తికర ఎపిసోడ్ నడుస్తుంది ప్రథమార్ధంలో. ఎక్కడో మొదలైన చిన్న తగవు.. తదనంతర పరిణామాలతో.. చివరగా కథానాయకుడి జీవితం మలుపు తిరిగే ఓ పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్.. ఇందులో వినోదం.. కొసమెరుపు లాంటి దీని ముగింపు చూశాక.. ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి ‘ఒరిజినల్’ మూవీ తీసిన వెంకటేష్ మహా.. ఈసారి ఏరి కోరి మలయాళ రీమేక్ ను ఎంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదనిపిస్తుంది. తనను అకారణంగా కొట్టిన ఓ వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకునే వరకు చెప్పులు వేసుకునేది లేదంటూ హీరో శపథం చేయడం భలే ఆసక్తికరంగా అనిపించి.. తర్వాత ఏం జరుగుతుందా అన్న ఆసక్తి పుడుతుంది. కానీ ఈ ఆసక్తిని నీరుగార్చేసే తర్వాతి కథనం  ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ను ఒక ‘మామూలు’ సినిమాగా మార్చేస్తుంది.
అతి సామాన్యుడైన హీరో.. మొరటోడైన విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడనే సింపుల్ స్టోరీతో తెరకెక్కిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయి. పాత్రల్లో సన్నివేశాల్లో సహజత్వం.. రీమేక్ అయినప్పటికీ నేటివిటీ ఫీల్ తీసుకొచ్చే విజువల్స్.. సోల్ ఫుల్ సంగీతం.. సునిశితమైన హాస్యం నిండిన.. ఆహ్లాదకరమైన సన్నివేశాలు.. హృదయాన్ని తాకే మాటలతో ఒక దశ వరకు ఈ చిత్రం మంచి స్థాయిలోనే సాగుతుంది. కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ.. కథ మలుపు తిరిగే వరకు  ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ప్రేక్షకుల్ని బాగానే ఎంగేజ్ చేస్తుంది. కానీ ఆసక్తికర ఘట్టం తర్వాత పక్కదారి పట్టి ఏముందీ సినిమాలో అనే భావన తీసుకొస్తుంది. ప్రేక్షకుడి అంచనాలకు భిన్నంగా.. డీవియేట్ అవుతూ సాగే మిడిల్ పోర్షన్ సినిమా గ్రాఫ్ ను కిందికి తీసుకెళ్లిపోతుంది. హీరో రెండో ప్రేమకథలో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. అతడి అసలు లక్ష్యం పక్కకు వెళ్లిపోవడంతో ఇది సగటు సినిమాలా మిగిలిపోతుంది.
హీరో శపథం చేసే సన్నివేశంలో ఉన్న ఇంటెన్సిటీ ఆ తర్వాత ఏమాత్రం లేకపోయింది. కమర్షియల్ సినిమాల్లో మాదిరి హీరో విన్యాసాలు చేయాలని ప్రేక్షకులు కోరుకోవడం తప్పు కావచ్చు.. ఈ కథను వాస్తవిక శైలిలో చెప్పాలని దర్శకుడు భావించి ఉండొచ్చు.. కానీ సన్నివేశాల్లో తీవ్రత తగ్గిపోవడం.. అసలు హీరో శపథం గురించి అతడితో సహా ప్రేక్షకులు కూడా మరిచిపోయేలా సన్నివేశాలు ‘తేలిక’గా మారిపోవడం..  ఉన్నట్లుండి క్లైమాక్స్ లో హీరో లక్ష్యాన్ని పూర్తి చేయించి హడావుడిగా సినిమాలు ముగించడంతో చివరికి సినిమా కూడా ‘తేలిపోయింది’. మాతృక మలయాళ ప్రేక్షకులకు ఎలాంటి భావన కలిగించి ఉన్నప్పటికీ.. మన ప్రేక్షకులకు మాత్రం  ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఓవరాల్ గా అంత ప్రత్యేకంగా అనిపించే అవకాశం లేదు. మామూలుగా చూస్తే జస్ట్ ఓకే అనిపించే ఈ చిత్రం.. అభిరుచి ఉన్న ఈ టీం మీద అంచనాలు పెట్టుకుని చూస్తే మాత్రం నిరాశకే గురి చేస్తుంది.

నటీనటులు: మలయాళంలో మేటి నటుడిగా గుర్తింపు పొందిన ఫాహద్ ఫాజిల్ పాత్రకు ఇక్కడ సత్యదేవ్ కంటే మంచి ఛాయిస్ లేదు అనిపించేలా అతను నటించాడు. అతడికిది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్నొచ్చు. సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే మహేష్ మన మనిషి అనుకునేలా అతను ఆ పాత్రను పండించాడు. ప్రేమ విఫలమైనపుడు.. అవమానానికి గురైనపుడు.. తండ్రితో వచ్చే సన్నివేశాల్లో.. ఇలా వివిధ సందర్భాల్లో అతడి హావభావాలు కట్టిపడేస్తాయి. లుక్ పరంగా కూడా సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్లలో రూప కొడువయూర్ కు మంచి మార్కులు పడతాయి. లుక్స్ విషయంలో మామూలాగా అనిపించినా.. తన చలాకీతనంతో ఆమె వావ్ అనిపిస్తుంది. ఆమెలో సహజమైన పెర్ఫామర్ కనిపిస్తుంది. ఇంకో కథానాయిక హరి చందన కూడా ఆకట్టుకుంది. నరేష్ తన అనుభవాన్ని చూపిస్తూ బాబ్జీ పాత్రను పండించాడు. సుహాస్ తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. నరేష్-సుహాస్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. వాళ్ల కలయికలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విలన్ పాత్రలో కనిపించిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం: పెద్దగా వనరులు లేనపుడే ‘కేరాఫ్ కంచరపాలెం’ను సాంకేతికంగా మంచి స్థాయిలోనే నిలిపాడు మహా. ఈసారి ఆ రకమైన ఇబ్బందులు లేకపోవడంతో తన అభిరుచికి తగ్గట్లు సాంకేతిక నిపుణుల నుంచి మరింత మంచి ఔట్ పుట్ తీసుకున్నాడు. అప్పు ప్రభాకర్ విజువల్స్ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. అరకు ప్రాంత మనుషుల్ని, అక్కడి అందాల్ని చాలా సహజంగా, ఆహ్లాదకరంగా చూపించింది అతడి కెమెరా. బిజ్బల్ సంగీతం కూడా అంతే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా లేవు కానీ.. అప్పటికి హాయిగా అనిపిస్తాయి. కథనంలో చక్కగా ఇమిడిపోయాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. కథ స్థాయికి తగ్గట్లు నిర్మాణ విలువలు పాటించారు. ‘‘వెళ్లిపోవాలనుకున్న వాళ్లను వెళ్లనివ్వకపోతే ఉన్నా వెలితిగానే ఉంటుంది’’  లాంటి లోతైన మాటలు ప్రభావవంతంగా అనిపిస్తాయి. ఇక ‘కేరాఫ్ కంచరపాలెం’ తర్వాత దర్శకుడు వెంకటేష్ మహాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటే.. అతను నిరాశకే గురి చేశాడు. అతను రీమేక్ ను ఎంచుకోవడంతోనే తనపై అంచనాలు తగ్గించేశాడు. మరోసారి తన అభిరుచిని చాటుకున్నా.. తొలి సినిమాలాగే ఓ సగటు మనిషి జీవితాన్ని వాస్తవికంగా చూపించడానికి మంచి ప్రయత్నమే చేసినా.. ఇంపాక్ట్ మాత్రం అనుకున్న స్థాయిలో లేకపోయింది. కథ మరీ అంత బలం లేకపోవడం.. ఒక దశ దాటాక స్క్రీన్ ప్లేలో బిగి లోపించడంతో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మహా స్థాయికి తగ్గ సినిమాలా నిలవలేకపోయింది. దర్శకుడిగా అతడికి పాస్ మార్కులు మాత్రమే పడతాయి.

చివరగా: ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య.. ఒక ‘మామూలు’ సినిమా

రేటింగ్-2.75/5
× RELATED లవ్ స్టోరి
×