కరోనా కల్లోలం: మంత్రి కుమారుడికి పాజిటివ్.. క్వారంటైన్ లోకి మంత్రి స్పీకర్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలంగా మారింది. కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఏపీలో సచివాలయ ఉద్యోగులతోపాటు ఒక మంత్రి కుమారుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులకు వారి కుటుంబాలకు కరోనా విస్తరిస్తోంది. ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొంటున్నాయి.

తాజాగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడు ఈ వైరస్ బారిన పడ్డాడు. కృష్ణదాస్ మంత్రిగా రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉండడంతో నియోజకవర్గ బాధ్యతలను ఆయన తనయుడే చూస్తున్నాడు. ఈ క్రమంలోనే పర్యటనల్లో మంత్రి కుమారుడికి ఈ మహమ్మారి సోకినట్టు తెలిసింది.

ఇటీవల కరోనా లక్షణాలు బయటపడగా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా రిపోర్టు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొడుకుకు కరోనా పాజిటివ్ గా తేలగానే మంత్రి కృష్ణదాస్ కూడా అప్రమత్తమై హోం క్వారంటైన్ లోకి వెళ్లాడు. మంత్రికి కూడా వైద్యఆరోగ్యశాఖ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిసింది.

ఇక శ్రీకాకుళం జిల్లాలో జరిగిన అధికారిక కార్యక్రమంలో మంత్రి కృష్ణదాస్ తో పాటు స్పీకర్ తమ్మినేని ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. దీంతో ప్రస్తుతానికి స్పీకర్ తమ్మినేని కూడా హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారని తెలిసింది. తమ క్యాంప్ కార్యాలయాలను మూసివేస్తున్నట్టు మంత్రి ధర్మాన స్పీకర్ తెలిపారు.

*ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం
ఏపీ సచివాలయాన్ని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చాలా మందికి సోకగా.. తాజాగా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో సచివాలయంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఉద్యోగుల సంఖ్య 38కి చేరింది.

*ఏపీలో ఇబ్బడి ముబ్బడిగా కేసులు..
ఏపీ మొత్తంలో కరోనా కేసుల సంఖ్య 23814కు చేరింది. ఇప్పటివరకు 277మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు.తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1406 కేసులు.. తర్వాత గుంటూరులో 1355 కేసులు నమోదయ్యాయి.  ప్రకాశం జిల్లాలో కొద్దిరోజులుగా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 128 కేసులు బయటపడ్డాయి.  మొత్తం జిల్లాలో కేసుల సంఖ్య 1321కి చేరింది.
× RELATED విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం
×