తెలుగు రాష్ట్రాల్లో ఈ ముగ్గురు డిఫెరెంట్?

ఒక పార్టీ గుర్తుపై గెలుస్తారు.. ఆ పార్టీ నుంచే ఎదుగుతారు. అత్యున్నత పదవులు అనుభవిస్తారు.. ఆ పార్టీపైనే కారాలు మిరియాలు నూరుతుంటారు. తమ అధినేతలపై అవాకులు చెవాకులు పేల్చుతారు. కానీ అదే పార్టీ అని చివర్లో అంటారు. తాము క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలు అంటారు. పదవులు పట్టుకొని వేలాడుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా వివిధ రాజకీయ పార్టీల్లో రెబల్స్ గా ఉంటూనే పార్టీని వీడని మొండి పట్టుదల వాదులు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదు.. టీఆర్ఎస్ నేత డీ శ్రీనివాస్.. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్నం రాజు. విశేషం ఏంటంటే ఈ ముగ్గురికి సొంత పార్టీ అంటే అస్సలు నచ్చదు. పొరుగు పార్టీ అంటే ఇంపు వీళ్లకి.. సొంత పార్టీ అంటే కంపుగా భావిస్తారు. ఈ ముగ్గురూ ముగ్గురే. సొంత పార్టీలోనే ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

 * కేసీఆర్ కు కొరుకుడు పడని డి.శ్రీనివాస్
 డీ. శ్రీనివాస్ (డీఎస్).. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో పీసీసీ చీఫ్ గా అన్నీ తానై వ్యవహరించిన నేత. బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన ఈయన అప్పట్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుకు తోడ్పడ్డారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయగల సామర్థ్యం ఈయన సొంతం. అయితే తదనంతర కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. సీనియర్ కావడంతో కేసీఆర్ రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ తో డీఎస్ దోస్తీ చెడింది. నిజామాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేసీఆర్ కూతురు కవితకు వ్యతిరేకంగా తన అనుచరులు నాయకులను ఆయన ఉసిగొల్పుతున్నారని గులాబీ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు. అయితే కేసీఆర్ వ్యూహాత్మకంగా మౌనం వహించి ఆయనను పార్టీకి దూరం గా పెట్టారు. సస్సెండ్ చేస్తే ఆయన రాజ్యసభ సీటులోనే కొనసాగుతారు. ఆయన వేరే పార్టీలో చేరితే అనర్హత వేటు వేద్దామని వేచిచూశారు. తద్వారా రాజ్యసభ సీటును దక్కించుకోవాలని యోచించారు. అయితే ఇక్కడే తలపండిన డీఎస్ రాజకీయం చేశారు.  వేరే పార్టీలో అధికారికంగా చేరకుండా.. వారి కండువా కప్పుకోకుండా టీఆర్ఎస్ ఎంపీగానే ఉంటూ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అధికారికంగా టీఆర్ఎస్ ఎంపీ అయినా బీజేపీకి సాన్నిహిత్యంగా మెలుగుతున్నారు.  డీఎస్  వేరే పార్టీ కండావా వేసుకొని కనిపిస్తే అప్పుడు అనర్హత వేటు వేద్దామని కేసీఆర్ చూస్తున్నా డీఎస్ మాత్రం ఎక్కడా దొరకడం లేదు. అలా ఎంపీ సీటును కాపాడుకునేందుకు డీఎస్ వేస్తున్న ఎత్తులు కేసీఆర్ చుక్కలు చూపిస్తున్నాయి.  ఎంతో మందిని కారణం లేకుండా.. పొగ రాకుండానే సాగనంపిన కేసీఆర్ టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉండి వ్యతిరేకంగా పనిచేస్తున్న డీఎస్ విషయంలో మాత్రం నిస్సహాయంగా ఉండిపోవడం అందరిలోనూ ఆశ్చర్యం కలిగిస్తోంది. తాటిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నేవాడుంటాడు అన్న సామెతను సీనియర్ డీ శ్రీనివాస్ నిజం చేస్తున్నారని చెప్పకతప్పదు.

*పవన్ అంటే కొంచెం ఇష్టం.. కొంచెం కష్టమంటున్న రాపాక
రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక సీటు రాజోలు కావడం విశేషం. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తాను పవన్ వల్లే గెలిచానని పార్టీకి విధేయుడిని అని చెప్పుకుంటాడు. కానీ  తొలినుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతీ నిర్ణయానికి ఆయన మద్దతు తెలుపుతుండటంతో ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. కానీ వైసీపీలో చేరరు. పవన్ బాటే తన బాట అంటారు. పవన్ ఈయన అసమ్మతిని సహిస్తూ ఉంటాడు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూనే ఉంటాడు రాపాక. జనసేన ఎమ్మెల్యే రాపాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ  రాపాకాపై చర్య తీసుకోవడానికి పవన్కు ధైర్యం చేయకపోవడం ఆయన నిస్సహాయతకు నిదర్శనమి చాలా మంది ఆడి పోసుకున్నారు. అసెంబ్లీ లోని అన్ని బిల్లులకు వైసీపీ కి రాపాక మద్దతిచ్చాడు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కి ఓటు వేశాడు. ఇంత చేస్తున్నా ఆయన జనసేనలోనే ఉంటాడు. పవన్ ను కలవడు. ఆయన సిద్ధాంతాలు పాటించడు. కానీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేనే. ఇలా పవన్ కు కొరుకుడుపడని విధంగా రాపాక కంట్లో నలుసులా మారాడు.

*రఘురామ.. అంతా నా ఇష్టం..
వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా గెలిచారు రఘురామ కృష్ణంరాజు. జగన్ వేవ్ లో గెలిచిన ఈయన నా సొంత ఇమేజ్ తోనే గెలిచానంటాడు. సీఎం వైఎస్ జగన్ మొదట్లో రఘురామ కృష్ణంరాజు కి మంచి గౌరవం ఇచ్చాడు అని వైసీపీలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ రఘురామకృష్ణం రాజు ఎంపీ పదవిని అడ్డుపెట్టుకొని బీజేపీ వాళ్లతో డైరెక్ట్ గా టచ్ లోకి వెళ్లాడని.. అలా వద్దని వైసీపీ పెద్దలు వారించినా వినిపించుకో లేదని సమాచారం. వైసీపీ ప్రోటోకాల్ పాటించాలని వైసీపీ పార్టీ అందరూ ఎంపీలకు సూచించినా రఘురామ మాత్రం పెడచెవిన పెట్టాడని అంటారు.  ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకొని రాసుకు పూసుకు తిరిగాడు. డైరెక్టుగా రఘురామకృష్ణం రాజుకి నేరుగా బీజేపీ వాళ్లతో టచ్ లోకి వెళ్లాడు. ఢిల్లీలో విపరీతంగా ఫాలోయింగ్ ఉందని ఊహించుకొని వైసీపీ తో అంటీ ముట్టనట్టు ఉండడం మొదలు పెట్టాడట.. ఈ క్రమంలోనే టీడీపీ అనుకూల మీడియాలకు టచ్ లోకి వెళ్లాడంట..  దీనిపై వైసీపీ హైకమాండ్ లో ఉన్న కొందరు పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని సూచించారట.. అయితే రఘురామ మాత్రం ‘మీరు అంతా ఒకసారి వెనక్కు వెళ్లి గుర్తు తెచ్చుకోండి.. నేను వైఎస్ఆర్ తో డిన్నర్ చేసేటప్పుడు మీరు అంతా డోర్ దగ్గర ఉండేవాళ్లు.. ఇప్పుడు నాకు మీరు చెప్పే వాళ్లా?’ అని అన్నాడు అని వైసీపీ లో ఒక వర్గం వాదిస్తోంది..  అయితే తాజాగా వైసీపీ అధిష్టానం షోకాజ్ నోటీస్ పంపేసరికి దెబ్బకు దేవుడు దిగివచ్చి తాను వైసీపీలో క్రమశిక్షణ గల కార్యకర్తను అని.. వైఎస్ జగన్ కు నమ్మిన బంటు అని.. బదులిచ్చాడు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని.. తనను సస్పెండ్ చేయవద్దంటూ అధిష్టానానికి విన్నవించాడు.

ఇలా పార్టీలోనే ఉంటూ పార్టీకి కొరకరాని కొయ్యలు గా ఈ ముగ్గురు మారారు. ఈ ముగ్గురి విషయంలో పార్టీలు కఠినంగా వ్యవహరించలేకపోతున్నాయి. వైసీపీ మాత్రం నోటీసులు ఇచ్చి రఘురామ పోస్ట్ ఊస్ట్ చేసే పనిలో పడింది. చూడాలి మరీ ఎం జరుగుతుందో..
× RELATED ఘనంగా పెళ్లి.. నిబంధనల ఉల్లంఘనతో జైలులో కాపురం
×