టెస్టు చేయకుండానే మహమ్మారి ఉందో అలా చెప్పేయొచ్చట

అక్కడెక్కడో వూహాన్ లో ఉందన్న మహమ్మారి ఇప్పుడు మన వీధుల్లోకి వచ్చింది. కొందరికైతే ఇప్పటికే పక్కిళ్లకు.. వెనకిళ్లకు పాకేసింది. దీంతో.. ఇప్పడు అందరిలోనూ ఆందోళన. ఏమవుతుందోనన్న భయం. కాస్తంత దగ్గు వచ్చినా.. ఒళ్లు నొప్పులుగా అనిపించినా.. గొంతులో నొప్పి అనిపిస్తే చాలు.. మహమ్మారి అంటేసిందన్న అనుమానంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటివేళ.. పరీక్ష ఒక్కటే మార్గమని చెబుతున్నా అందులో నిజం లేదు.

ఎందుకంటే.. ఇవాళ పరీక్ష చేయించుకుంటే.. ఇవాల్టి వరకూ మాత్రమే వైరస్ లేనట్లు. అది కూడా పరీక్ష పక్కాగా చేస్తేనే. ఏ చిన్న లోపంతో శాంపిల్ సేకరణ జరిగినా.. వైరస్ లోడ్ గుర్తించే అవకాశం మిస్ అవుతుంది. టెస్టు తర్వాత ఇంటికి వస్తూ దారిలో కూడా వైరస్ అంటుకునే అవకాశం లేకపోలేదు. చాలామంది పరీక్షలతో ఫలితం ఉంటుందని చెబుతారు కానీ.. అందులో నిజం లేదని చెప్పాలి.

మరి.. ఇలాంటివేళ.. మనసుకు కలిగే సందేహాలకు సమాధానపర్చటం ఎలా? అన్నది ప్రశ్న. దీనికి సమాధానంగా ఏపీకి కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేక అధికారి డాక్టర్ సి. ప్రభాకర్ రెడ్డి కొత్త సూచన చేస్తున్నారు. సింఫుల్ విధానంతో సమస్య తీవ్రతను గుర్తించే వీలుందని చెబుతున్నారు. ఎవరికి వారు వంద అడుగులు నడిస్తే వైరస్ ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వంద అడుగులు నడిచే సమయంలో ఆయాసం లాంటివి వస్తే కొంత సమస్య ఉన్నట్లుగా అనుకోవచ్చని చెబుతున్నారు.

ఈ విధానాన్ని విజయవాడలో ఒక వంద మందితో పరీక్షించగా 58 మంది ఆయాస పడ్డారని.. వారికి కరోనా పరీక్ష నిర్వహించ గా ఎనిమిది మంది కి పాజిటివ్ వచ్చినట్లుగా చెప్పారు. మహమ్మారి ఉందా? లేదా? అన్న విషయాన్ని ప్రాథమికంగా తేల్చేందుకు ఈ విధానం సురక్షితమైనదన్న మాట వినిపిస్తోంది. ప్రతిసారీ టెస్టు కోసం పరుగులు తీసే కన్నా.. ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. అంతేకాదు.. ఈ విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సిఫార్సు చేస్తున్నట్లు చెబుతున్నారు.
× RELATED ఘనంగా పెళ్లి.. నిబంధనల ఉల్లంఘనతో జైలులో కాపురం
×