పెంగ్విన్

చిత్రం : 'పెంగ్విన్'

నటీనటులు: కీర్తి సురేష్-లింగ-మదంపట్టి రంగరాజ్-మాస్టర్ అద్వైత్-మది-హరిణి తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం-సుధన్ సుందరం-జయరాం
రచన-దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్

లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడి ఉన్న నేపథ్యంలో నేరుగా ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ కోవలో తెలుగులో ఇప్పటికే ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమా ఒకటి విడుదలైంది. ఆ తర్వాత ఇప్పుడు కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మహానటి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన కీర్తి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కావడం.. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని సమర్పించడం.. దీని ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాల్ని ‘పెంగ్విన్’ ఏ మేర అందుకుందో చూద్దాం పదండి.

కథ: రిథమ్ (కీర్తి సురేష్)కు తన రెండేళ్ల కొడుకు అజయ్ అంటే ప్రాణం. అతను ఒక రోజు కనిపించకుండా పోతాడు. తన కోసం వెతికి వెతికి అలసిపోతుంది. ఏడాది తర్వాత కూడా అతడి కోసం అన్వేషణ ఆపదు. దీని వల్ల మానసికంగానూ దెబ్బ తిన్న రిథమ్ ను భర్త రఘు (లింగ) విడిచిపెట్టి వెళ్లిపోతాడు. కొన్నేళ్ల తర్వాత తన గురించి అంతా తెలిసి, అర్థం చేసుకున్న గౌతమ్ (రంగరాజ్) అనే మరో వ్యక్తిని రిథమ్ పెళ్లి చేసుకుంటుంది. తర్వాత గర్భం దాల్చి ప్రసవం కోసం ఎదురు చూస్తుంటుంది. కానీ అప్పటికే తన కొడుకు దూరమై ఆరేళ్లు గడిచినా ఆమెను అతడి ఆలోచనలు విడిచిపెట్టి పోవు. అజయ్ కోసం మళ్లీ వెతుకుతుండగా.. అనూహ్య పరిణామాల మధ్య అతను మళ్లీ ఆమె దగ్గరికి వస్తాడు. అప్పుడు అజయ్ ఏ స్థితిలో ఉన్నాడు.. అన్నేళ్ల పాటు అతను ఏమయ్యాడు.. అతను అదృశ్యం కావడం వెనుక కారణం ఎవరు.. ఆ వ్యక్తి గుట్టును రిథమ్ ఎలా కనిపెట్టి మిస్టరీని ఎలా ఛేదించింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘‘అన్ని కథల వెనుక ఎప్పుడూ ఒక తల్లి కథ ఉంటుంది.. ఎందుకంటే ప్రతి కథా మొదలయ్యేది అక్కడి నుంచే’’.. ‘పెంగ్విన్’ ట్రైలర్లో ఈ క్యాప్షన్.. ఇంకా అందులో కొన్ని డైలాగులు.. కొన్ని విజువల్స్.. చూసి మనం చాలా డెప్త్ ఉన్న, ఉత్కంఠ రేకెత్తించే ఒక సినిమా చూడబోతున్నామన్న భావనలోకి వెళ్తాం. ఇక ‘పెంగ్విన్’ సినిమాను మొదలుపెట్టిన సన్నివేశం చూస్తే ఒక గగుర్పాటు కలుగుతుంది. తర్వాత ఒక తల్లి పెంగ్విన్ సముద్రంలో చిక్కుకున్న తన పిల్ల పెంగ్విన్‌ ను కాపాడటం కోసం ఎలా ప్రాణాలకు తెగించి పోరాడుతుందో ఒక కథ రూపంలో తల్లి బిడ్డకు చెప్పడం ద్వారా సినిమాను ముందుకు నడిపిస్తున్న తీరు చూసి దర్శకుడు సింబాలిక్ గా సినిమా కథను చెప్పే ప్రయత్నం చేయడమూ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందనే ఫీలింగ్ ను మరింతగా పెంచుతుందా సన్నివేశం. మొత్తంగా అప్పటికే చూసిన ప్రోమోలు, సినిమా ఆరంభ సన్నివేశాలు చూశాక కలిగే ఎగ్జైట్మెంటే వేరు. కానీ రెండు గంటలు గడిచాక మాత్రం ఒక నిట్టూర్పు విడిచి తల పట్టుకుంటాం. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్పా అని.

థ్రిల్లర్ సినిమాలకు ట్విస్టులే ప్రధాన బలం. ఇక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ అంటే ఆ కిల్లర్ ఎవరు, తనమోటివ్ ఏంటి అన్నది ఉత్కంఠ రేకెత్తించే అంశం. చివరి వరకు సస్పెన్సును ఎలా దాచి పెట్టారు అన్నది.. అక్కడి దాకా కథనాన్ని ఎలా నడిపించారు అన్నది తర్వాతి సంగతి.. ముందు ఆ కిల్లర్లో శాడిజం పెరగడానికి.. దారుణాలు చేయడానికి సరైన కారణం కనిపించాలి. అది కన్విన్సింగ్ గా అనిపించాలి. ఆ కిల్లర్ చర్యలన్నీ నమ్మశక్యంగానూ అనిపించాలి. కానీ ‘పెంగ్విన్’లో ట్విస్టు చూశాక థ్రిల్లర్ సినిమా కాస్తా కామెడీ సినిమా అయ్యే స్థాయి ‘సిల్లీనెస్’ కనిపిస్తుంది. ఈ పాయింట్ చుట్టూ కథను అల్లి కార్తీక్ సుబ్బరాజ్ లాంటి అగ్ర దర్శకుడిని, కీర్తి సురేష్ లాంటి నటిని ఈ సినిమాకు ఎలా ఒప్పించాడా అని సందేహం కలుగుతుంది. ట్విస్టు చూసి షాకవ్వాల్సిన ప్రేక్షకులు.. ఇదీ ఒక ట్విస్టా అని షాకయ్యేలా అది తయారైంది. ఆ ట్విస్టు సంగతి వదిలిపెట్టి.. అంతకుముందు నడిచే కథనంలో అయినా ఉండాల్సినంత విషయం ఉందా అంటే అదీ లేదు.

17 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ల ఉసురు తీయడమే కాక.. తన అఘాయిత్యాల గురించి తెలిసిన వాళ్లను కూడా కిరాతకంగా చంపేస్తున్న శాడిస్ట్ కిల్లర్ డెన్లోకి హీరోయిన్ వెళ్తుంది. తన రహస్యాలన్నీ తెలుసుకుంటుంది. ఆమె చూస్తే నిండు గర్భిణి. పైగా ఆమె వెంట లోకం తెలియని పిల్లాడుంటాడు. పైగా ఆ డెన్‌లో చిక్కుకున్న ఇంకో పాపను కూడా హీరోయిన్ కాపాడాలి. అప్పుడే కిల్లర్ అక్కడికి వస్తాడు. ఈ సీన్లో హీరోయిన్ తప్పించుకుని ఆ పిల్లల్ని కాపాడే తీరు చూస్తే కమర్షియల్ సినిమాల్లో స్టార్ హీరోలు గుర్తుకొస్తారు. హీరోయిన్ని ధీరురాలిగా చూపించే ప్రయత్నంలో ఆ కిల్లర్ పాత్ర గాలి తీసేసేలా ఈ సన్నివేశాన్ని తయారు చేసి పెట్టాడు దర్శకుడు. సినిమా అంతటా ఇలాంటి లూజ్ ఎండ్స్.. లాజిక్ కు అందని సన్నివేశాలు ఎన్నెన్నో. ఈ కిల్లర్ పోలీసులకు పట్టుబడ్డాక.. అతడికి, కథానాయికకి మధ్య ‘గేమ్’ పేరుతో ఒక ఎపిసోడ్ నడిపించారు. నేపథ్య సంగీతంతో.. ఆ రెండు పాత్రల హావభావాలతో.. డైలాగులతో ఈ ఎపిసోడ్ కు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. కానీ ఆ గేమ్ చివరికొచ్చేసరికి చికాకు పుడుతుంది. అక్కడి నుంచి చివరి ట్విస్టుకు వెళ్లేసరికి తలలు బొప్పి కడతాయి.

ఎప్పుడూ చూసే సీరియల్ కిల్లర్ కథలకు భిన్నంగా ఇక్కడ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం అన్నది ‘పెంగ్విన్’లో భిన్నంగా కనిపించే విషయం. దీని వెనుక కారణం ఏమై ఉంటుందనే ఉత్కంఠ చాలాసేపు వెంటాడుతుంది. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు అర్ధరహితంగా సాగినా.. సస్పెన్స్ కొనసాగడం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తి రేకెత్తించడంతో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉంటుంది. కానీ ద్వితీయార్ధంలో అసలేమాత్రం లాజిక్ లేని సన్నివేశాలతో ‘పెంగ్విన్’ను పూర్తిగా ట్రాక్ తప్పించేశాడు దర్శకుడు. కిల్లర్ ఎవరనే విషయంలో ప్రేక్షకుల్లో రకరకాల సందేహాలు రేకెత్తాలనే ఉద్దేశంతో హీరోయిన్ భర్త, మాజీ భర్త పాత్రలతో విచిత్రమైన హావభావాలు ఇప్పించాడు దర్శకుడు. దీంతో ఆ పాత్రలు చికాకు పెట్టేలా తయారయ్యాయి. కొంత సేపు చాలా ఆసక్తికరంగా అనిపించే పిల్లాడి పాత్రను కూడా తర్వాత తేల్చి పడేశారు. థ్రిల్ కోసం డాక్టర్ పాత్రతో నడిపించిన ఎపిసోడ్.. చివరికి చూస్తే ఒక ట్రాష్ లాగా అనిపిస్తుంది. కనీసం ఆ డాక్టర్ పాత్రనే ప్రధాన విలన్ని చేసి ఉన్నా.. సగటు సీరియల్ కిల్లర్ సినిమాలా ఓ మోస్తరుగా అనిపించేది ‘పెంగ్విన్’. కానీ ఇంకేదో ట్రై చేసేసరికి మొదటికే మోసం వచ్చింది.

నటీనటులు: ‘మహానటి’ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల మత్తులో పడి కీర్తి ఈ సినిమా ఒప్పుకున్నట్లు అనిపిస్తుంది. మొత్తం తన చుట్టూ తిరిగే కథ కావడం, వినడానికి ఛాలెంజెంగ్ గా అనిపించే పాత్ర కూడా కావడం ఆమెను టెంప్ట్ చేసి ఉండొచ్చు. ఆమె తన వంతుగా సినిమాను తన భుజాల మీద మోసే ప్రయత్నం చేసింది. కొన్ని సన్నివేశాల్లో కీర్తి నటన హృద్యంగా అనిపించినా.. అసహజమైన కథాకథనాల వల్ల ఆమె నటన కూడా కొన్ని చోట్ల కృత్రిమంగా తయారైంది. అలాగని ఆమెను తప్పుబట్టడానికేమీ లేదు. ఈ వయసులో ఎనిమిదేళ్ల పిల్లాడి తల్లిగా.. నిండు గర్భిణిగా పూర్తి డీగ్లామరస్ రోల్ చేయడానికి అంగీకరించడమే సాహసం. లుక్ పరంగా కీర్తి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ పాత్ర కోసమే లుక్ మార్చుకుందో ఏమో కానీ.. ఆమె కళావిహీనంగా కనిపించింది. మిగతా నటీనటుల్లో అజయ్ గా నటించిన చిన్న పిల్లాడు ఆకట్టుకున్నాడు. కీర్తి భర్త, మాజీ భర్తల పాత్రల్లో నటించిన ఇద్దరి గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. రెండో భర్త పాత్రలో కనిపించిన నటుడు మరీ మొక్కుబడిగా నటిస్తే.. మొదటి భర్తలో చేసినతను ఓవరాక్షన్‌ తో విసిగించాడు. ఆ ఇద్దరూ కీర్తి పక్కన ఎంతమాత్రం సరిపోలేదు. డాక్టర్ పాత్రలో చేసిన నటుడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక చెప్పుకోదగ్గ పాత్రధారులెవరూ లేరు.

సాంకేతిక వర్గం: థ్రిల్లర్ సినిమా అనగానే టెక్నికల్ టీం బలంగానే ఉండేలా చూసుకుంటారు. కీర్తి, కార్తీక్ సుబ్బరాజ్ లాంటి వాళ్ల పేర్లున్నాయి కాబట్టి క్వాలిటీకి లోటు లేకపోయింది. సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాను పైకి లేపే ప్రయత్నం చేశాడు. మొదట్లో అతడి నేపథ్య సంగీతం సన్నివేశాల్ని డామినేట్ చేసినట్లు అనిపించినా.. ఆ తర్వాత సింక్ అయింది. సినిమాలోని ఏకైక పాట ఏమంత బాగా లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాలో చెప్పుకోదగ్గ హైలైట్. కార్తీక్ పళని కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. టైటిల్ కార్డ్ పడేటపుడు విజువల్స్ వావ్ అనిపిస్తాయి. మొత్తంగా కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువల్లోనూ ఒక స్థాయి కనిపిస్తుంది. ఐతే వనరులకు ఏమాత్రం లోటు లేకపోయినా.. రచయిత, దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ వాటిని ఉపయోగించుకోలేకపోయాడు. మూల కథ దగ్గరే అతను తేలిపోయాడు. స్క్రీన్ ప్లే విషయంలోనూ ఏ ప్రత్యేకతా చూపించలేకపోయాడు. థ్రిల్లర్ సినిమాలకు అత్యంత కీలకమైన ‘బిగి’ ఇందులో మిస్సయింది. అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ మినహా ‘పెంగ్విన్’లో విషయం కనిపించదు.

చివరగా: పెంగ్విన్.. విషయం తక్కువ, హడావుడి ఎక్కువ

రేటింగ్-2/5

× RELATED 'మిడిల్ క్లాస్ మెలొడీస్'
×