ఇప్పుడు మహేష్ అండ్ టీమ్ ఏమి చేయబోతున్నారు...?

సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి మహేష్ కానీ చిత్ర నిర్మాతలు కానీ అఫీసియల్ గా ప్రకటించలేదు. కాకపోతే డైరెక్టర్ పరశురామ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని వెల్లడించాడు. దీంతో వీరి కాంబోలో ప్రాజెక్ట్ ఉండబోతోందనే వార్తలపై క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో బ్లాక్ బస్టర్ గా బాప్ అనిపించుకున్న మహేష్ బాబు నెక్స్ట్ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టే మహేష్ తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ నెల 31న ఈ సినిమా అఫీసియల్ గా ప్రారంభించాలని అనుకుంటున్నారట. గత కొన్నేళ్లుగా మహేష్ మే 31న తన సినిమాకి సంభందించి ఏదొక అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్ స్టార్ట్ చేయాలని.. అదే రోజు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయాలని భావించారట. ఇప్పటికే దీనికి సంభందించిన పోస్టర్ డిజైన్ కూడా రెడీ అయిందట.

అయితే నిన్న సూపర్ స్టార్ టీమ్ కి ఊహించని విధంగా షాక్ ఇస్తూ మహేష్ 27 టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మహేష్ - పరశురామ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాకి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ అనుకుంటున్నారని.. ఇదే టైటిల్ ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని న్యూస్ స్ప్రెడ్ అయింది. దీంతో ఒక్కసారిగా మహేష్ టీమ్ షాక్ కి గురైందంట. ఇంత గోప్యంగా ఉంచినా ఈ సినిమా టైటిల్ ఎలా లీక్ అయ్యిందా అని తలలు పట్టుకుంటున్నారట. కృష్ణ బర్త్ డే నాడు సర్ప్రైజ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ నీరుగారి పోయిందని బాధపడుతున్నారట. మరి ఇప్పుడు మహేష్ 27 అండ్ టీమ్ 'సర్కార్ వారి పాట' టైటిల్ ఫిక్స్ చేస్తారో లేదా వేరే టైటిల్ ఆలోచిస్తారో చూడాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎంబీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయట. అంతేకాకుండా ఈ సినిమాకి ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
× RELATED 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అంటున్న దేవరకొండ...!
×