షూటింగ్ లు - బాలయ్య వ్యాఖ్యలపై తలసాని స్పందన

త్వరలోనే తెలంగాణలో సినిమా షూటింగ్ లకు అనుమతిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కార్యాలయంలో సినీ ప్రముఖులతో తలసాని గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హీరో నాగార్జున దర్శకుడు రాజమౌళి త్రివిక్రమ్ కొరటాల శివ డి. సురేష్ బాబు సుప్రియ మా అధ్యక్షులు నరేశ్ తదితరులు హాజరయ్యారు.

మీటింగ్ అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. సినిమా షూటింగ్ ల ప్రారంభంపై చర్చించామని.. ఇందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై పలు సూచనలు చేసినట్టు వెల్లడించారు. విధానపరమైన నిర్ణయాలు రూపొందించామని తెలిపారు.

సినీ రంగం ప్రతినిధుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదించగానే అమలు చేస్తామని మంత్రి తలసాని తెలిపారు.

ఇక బాలక్రిష్ణ తనను మీటింగ్ లకు పిలవకపోవడం గురించి చేసిన వ్యాఖ్యలపై తలసాని స్పందించారు. ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్న వారినే చర్చలకు పిలిచామని క్లారిటీ ఇచ్చారు. బాలక్రిష్ణ ఏమన్నారో చూసిన తర్వాత స్పందిస్తానని తెలిపారు. ఏం జరిగిందో తెలుసుకుంటానని.. సమావేశానికి ఇండస్ట్రీలోని వాళ్ల అందరినీ పిలవలేదని.. చురుకుగా ఉన్న వాళ్లనే పిలిచామని తెలిపారు. దర్శకులు నిర్మాతలు ఎగ్జి బిటర్ల అంశం కావడంతో వాళ్లతోనే మాట్లాడామని తెలిపారు. బాలయ్యను పిలుస్తామంటే నాకేం అభ్యంతరం లేదన్నారు.

రాజమౌళి నాగార్జునలు సైతం మీటింగ్ అనంతరం మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సినీ రంగం సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారని.. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
× RELATED 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అంటున్న దేవరకొండ...!
×