నన్ను పిలవలేదు..భూములు పంచుకుంటున్నారా?

టాలీవుడ్ సినీ పెద్దలపై నందమూరి బాలయ్య నిప్పులు చెరిగారు. కేసీఆర్ తో భేటికి తనను పిలవకపోవడం.. కనీసం సంప్రదించకపోవడం.. అవమానించడంపై మండిపడ్డారు. మంత్రి తలసానితో భేటికి పిలవలేదని.. వాళ్లు హైదరాబాద్ లో భూములు పంచుకుంటున్నారా.. నన్ను ఒక్కరు పిలవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారా అంటూ చెప్పరాని బూతు వ్యాఖ్యంతో ఫైర్ అయ్యారు.

ఇక బాలయ్య విమర్శలు సినిమా ఇండస్ట్రీని షేక్ చేశాయి. చిరంజీవి, నాగార్జునలను పిలిచి బాలయ్యను పిలవకపోవడం చర్చనీయాంశం కావడంతో సినీ నిర్మాత సీ కళ్యాన్ స్పందించారు. బాలయ్య సినిమాలేవి షూటింగ్ లో లేవని.. ఉంటే ఆయన నిర్మాతను.. ఆయనను పిలిచేవాళ్లమని.. అవసరమైతే బాలయ్యను పిలుస్తామని కవర్ చేసే ప్రయత్నం చేశారు.  బాలయ్యను అవమానించే ఉద్దేశం ఇండస్ట్రీలో ఎవరికీ లేదని చెప్పాడు. అదే సమయంలో చిరంజీవిని నాయకత్వం వహించాలని తామే కోరామని.. మాకు పని జరగటం ముఖ్యమని.. ప్రతీ ఒక్కరిని ఆహ్వానించడానికి ఇది ఆర్టిస్ట్ ల మీటింగ్ కాదని సీ కళ్యాణ్ తాజాగా బాలయ్యకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

ఇక సీఎం కేసీఆర్ తో మీటింగ్ కు తనను పిలవలేదని బాలయ్య చేసిన విమర్శలపై తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం స్పందించారు. బాలక్రిష్ణ ఏమన్నారో చూసిన తర్వాత స్పందిస్తానని తెలిపారు. ఏం జరిగిందో తెలుసుకుంటానని.. సమావేశానికి ఇండస్ట్రీలోని వాళ్ల అందరినీ పిలవలేదని.. చురుకుగా ఉన్న వాళ్లనే పిలిచామని తెలిపారు. దర్శకులు, నిర్మాతలు, ఎగ్జి బిటర్ల అంశం కావడంతో వాళ్లతోనే మాట్లాడామని తెలిపారు. బాలయ్యను పిలుస్తామంటే నాకేం అభ్యంతరం లేదన్నారు.

ఇక ఇదేవిషయంపై బాలక్రిష్ణ మహానాడులో సైతం ఆడిపోసుకున్నారు. కొందరు కావాలనే తనను దూరం పెట్టారని.. తోటి హీరోలను పిలిచి తనను పిలవకపోవడం ఏంటని వాపోయారు.

బాలక్రిష్ణ రేపిన వివాదం ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేస్తోంది. దానికి సీ కళ్యాణ్ లాంటి వారు కౌంటర్ ఇచ్చినా మాటల మంటలు ఆరడం లేదు. దీనిపై అగ్రహీరో చిరంజీవి సహా ఏ పెద్ద హీరో ఇప్పటిదాకా స్పందించలేదు. మరి ఈ వివాదం ఎటువైపు తీసుకెళ్తుందనేది వేచిచూడాలి.

× RELATED వల్లభనేని ఈ నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా?
×