ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

విశాఖపట్టణం సమీపంలోని ఆర్.ఆర్. వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణంలో స్టైరిన్ గ్యాస్ లీకయి 11మంది మృతిచెందగా వందల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా హైకోర్టు ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ కంపెనీ డైరెక్టర్ల పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని సూచించింది.

 లాక్డౌన్ తర్వాత కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు.. ఎవరి అనుమతి తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఎల్జీ పాలిమర్స్ పరిసరాలను సీజ్ చేయాలని.. కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరినీ లోనికి అనుమతించకూడదని స్పష్టం చేసింది. గ్యాస్ దుర్ఘటనపై విచారణ జరుపుతున్న కమిటీలు మాత్రమే ఎల్జీ పాలిమర్స్ పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని తెలిపింది.

ఈ క్రమంలో ఆ దుర్ఘటనపై ఏం పరిశీలించారో రికార్డు బుక్కుల్లో పేర్కొనాలని హైకోర్టు తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్ గ్యాస్ను తరలించేందుకు..  ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే విద్యాసంస్థలు హాస్పిటల్స్ - జనావాసాలు ఉన్నచోట అంత ప్రమాదకరమైన గ్యాస్ ను ఎలా స్టోర్ చేశారని న్యాయస్థానం కంపెనీని ప్రశ్నించింది.

గ్యాస్ లీకేజీ ఘటనను మే 7న సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం డైరెక్టర్లను స్వేచ్ఛగా వదిలేయడం స్టైరిన్ గ్యాస్ తరలించేందుకు అనుమతించడంపై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. శుక్రవారం విచారణ తర్వాత హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు విడుదల చేసింది.

× RELATED వల్లభనేని ఈ నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా?
×