ట్రిప్పులకు హైదరాబాద్ లో ఆర్టీసీ రెడీ..గ్రీన్ సిగ్నలే తరువాయి!

రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ) సేవలు ప్రారంభమయ్యాయి. ఒక్క హైదరాబాద్ మినహా తెలంగాణవ్యాప్తంగా బస్సులు రయ్య్మంటూ తిరుగుతున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం కంటైన్ మెంట్ - రెడ్ జోన్ గా ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సేవలతో ఆర్టీసీకి పెద్ద ఆదాయం రావడం లేదు. హైదరాబాద్ లో కోటి మందికి పైగా జనాభా ఉంటారు. ప్రజలు వ్యక్తిగత వాహనాలతో పాటు ఆర్టీసీలో కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణం చేసే వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదాయం కోసం.. ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ లో ఆర్టీసీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ సిద్ధం కాగా.. ప్రభుత్వ నిర్ణయమే ఆలస్యం.

ప్రస్తుతం మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందకుండా ఆర్టీసీ ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఇందుకోసం బస్సుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతో బస్సులు నడిపేందుకు తాము సిద్ధమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను సోమవారం నుంచి విధులకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశీయ విమానాలు నడుస్తుండటంతో ఎయిర్ పోర్టు వైపు బస్సులను పునరుద్ధరించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ అనుమతి వస్తే డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం బస్సులు నడిపేందుకు ఆర్టీసీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ రెడ్ జోన్గా ఉన్న సాధారణ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ - ప్రైవేటు కార్యాలయాల్లో వందశాతం సిబ్బందితో పని చేస్తున్నాయి. ప్రజల రాకపోకలు భారీగా పెరిగాయి. దుకాణాలు కూడా 50శాతం తెరవడంతో ఇప్పుడు ఆర్టీసీ సేవలు అత్యావసరం. ఈ సమయంలో బస్సులు నడపకపోతే ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో ఆర్టీసీ సమాలోచనలు చేసి సేవల పునరుద్ధరణకు సిద్ధమైంది.  కేంద్ర రాష్ట్ర నిర్దిష్టమైన మార్గదర్శకాలను పాటిస్తూ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ రెడీగా ఉంది.  ప్రభుత్వం పచ్చజెండా ఊపితే సోమవారం మే 25వ తేదీ నుంచి హైదరాబాద్లో బస్సులు రయ్య్మనే అవకాశాలు ఉన్నాయి.


× RELATED వల్లభనేని ఈ నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా?
×