వైరల్: వలస కూలీల ఆకలి చిత్రం

ఈ మహమ్మారితో దేశవ్యాప్తంగా విధించిన నిర్బంధం కారణంగా అందరికంటే ఎక్కువగా ఇబ్బందులు పడింది వలస కూలీలే. తినడానికి తిండి లేక.. ఉండడానికి ఇళ్లు లేక.. నా అనేవారికి దూరంగా రెండు నెలలుగా నరకం అనుభవించారు. ఇప్పుడు కాస్త సడలింపులతో రైళ్లు నడుపుతుండడంతో అందరూ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇదేదో లాక్ డౌన్ విధించినప్పుడే వాళ్లను పంపిస్తే ఇంతటి కష్టాలు వారికి ఉండేవీ కావేమో..

తాజాగా ఢిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ లో క్లిక్ మనిపించిన ఒక్క ఫొటో వలస కూలీల ఆకలికేకలకు అర్థం పట్టింది. సొంతూళ్లకు వెళ్లేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలు ఎక్కేందుకు వలస కూలీలు ఢిల్లీలోని ఓల్డ్ రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. రైలు వచ్చింది. ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఈ తరుణంలోనే అక్కడికి ఒక వ్యక్తి ఒక తోపుడు బండిలో చిప్స్ బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చాడు.

కొంత మంది అతడి దగ్గర కొనడానికి వెళ్లగా.. వలస కూలీలంతా సమూహంగా వచ్చి ఆహారం కోసం ఎగబడ్డారు. ఎవరికి తోచింది వారు ఆహారాన్ని ఎత్తుకెళ్లారు. ఇక కొందరు ఈ ఆహారం కోసం కొట్టుకోవడం వలస కూలీల ఆకలి మంటలను కళ్లకు కట్టింది.

ఈ వలస కూలీల తిండి తిప్పలు అంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ సమయంలో ఒక్క రైల్వే పోలీస్ కూడా అక్కడ లేడు. లాక్ డౌన్ వేళ పస్తులుంటున్న వలస కూలీలు ఇలా రైలు వద్దకు ఆహారం రాగానే ఎగబడ్డ తీరు అందరినీ కలిచివేసింది. దేశంలో ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది.


× RELATED సర్వేకెళ్లిన తహసీల్దార్ నే చంపేశారు.. సీఎం సీరియస్
×