డీఎంకే ఎంపీ అరెస్ట్ - క్షణాల్లో బెయిల్..అసలేం జరిగింది?

కరోనా వైరస్ విజృంభణతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. ఇలాంటి కీలక తరుణంలో అక్కడ రాజకీయ రచ్చ రాజుకుంది. విపక్ష పార్టీ డీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్ఎస్ భారతి అరెస్ట్ కావడం ఆ వెంటనే గంటల వ్యవధిలోనే ఆయనకు బెయిల్ రావడం నిజంగానే ఇప్పుడు అక్కడ పెద్ద చర్చకే తెర లేపిందని చెప్పాలి. ఆర్ఎస్ భారతిని పోలీసులు ఇటు అరెస్ట్ చేశారో లేదో... అటు బెయిల్ రావడం ఆ వెంటనే ఆయన జైలుకెళ్లకుండానే బయటకు రావడం నిజంగానే ఆసక్తి రేపుతోంది. అంతేకాకుండా భారతి అరెస్ట్ కు దారి తీసిన కారణాలు తన అరెస్ట్ పై భారతి చేసిన కామెంట్లు... నిజంగానే తమిళనాడులో పెద్ద రచ్చకే దారి తీసేలా పరిస్థితులు మారిపోయాయని చెప్పక తప్పదు.

శనివారం తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. డీఎంకేలో సీనియర్ నేతగానే కాకుండా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగుతున్న ఆర్ ఎస్ భారతిని శనివారం చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారతిని అరెస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అరెస్టైన వెంటనే భారతి విడుదలైపోయారు. తమిళనాడుకు చెందిన దళిత హక్కుల సంస్థ ‘ఆది తమిజార్ పెరవై’కి చెందిన అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకే భారతిని అరెస్ట్ చేశారట. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ సమావేశంలో పాలుపంచుకున్న భారతి... ఎస్సీ న్యాయమూర్తుల నియామకాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది అరుణ్ కుమార్ వాదన. అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు తేన్యాంపేట పోలీసులు భారతిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఇది ఒక వాదన అయితే... తన అరెస్ట్ తనపై కేసు నమోదుకు సంబంధించి భారతి చెబుతున్న వాదన మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రభుత్వ అవినీతిని బయటపెట్టినందుకే తనను టార్గెట్ చేసి జైలుకు పంపించే కుట్ర జరుగుతోందని భారతి వాదిస్తున్నారు. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం అవినీతిపై తాను విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయడమే తనను టార్గెట్ చేయడానికి ప్రధాన కారణమని కూడా భారతి చెబుతున్నారు. అయినా ఎస్సీ న్యాయమూర్తులపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని చెబుతున్న కార్యక్రమం జరిగి 100 రోజుల తర్వాత తనను అరెస్ట్ చేయడమేమిటని కూడా భారతి వాదిస్తున్నారు. ఇక కరోనా నియంత్రణలో భాగంగా కోయంబత్తూరులో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు రూ.200 కోట్లు ఖర్చు చేయడంపై ఫిర్యాదు చేసేందుకు తాను సిద్ధమవుతున్నట్లుగా భారతి చెప్పారు. ఈ తరహా అవినీతి బయటపడకూడదన్న భావనతోనే తనను టార్గెట్ చేస్తున్నారని భారతి ఆరోపించారు. తనను అరెస్ట్ చేసినా కూడా మంత్రి వేలుమణిపై ఫిర్యాదు చేసి తీరతానని కూడా భారతి చెప్పడం విశేషం.
× RELATED పోలీసులకు పొంచి ఉన్న ముప్పు: మహారాష్ట్రలో 114 మందికి వైరస్
×