హెచ్-1బీలో కీలక మార్పులివే..వీరే ప్రాధాన్యం

అమెరికాలో ఉద్యోగం ఉపాధి పొందడానికి విదేశీయులకు జారీ చేసే హెచ్-1బీలో కీలక మార్పులు చేస్తూ అమెరికా చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా పౌరుల ఉపాధి కాపాడడం ముఖ్య ఉద్దేశంగా బిల్లులో ప్రతిపాదించారు. అదే సమయంలో అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకు తొలి ప్రాధాన్యం లభించేలా ఈ బిల్లును రూపొందించారు. ఈ మేరకు రిపబ్లికన్ డెమొక్రటిక్ పార్టీల ప్రతినిధుల బృందం ‘ది హెచ్1బీ అండ్ ఎల్1 వీసా రిఫార్మ్ యాక్ట్’ పేరిట చట్టసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

అమెరికా ఉద్యోగుల స్థానాన్ని హెచ్1బీ ఎల్1 వీసాదారులు భర్తీ చేయడాన్ని పూర్తిగా నిషేధించాలని బిల్లులో పేర్కొన్నారు. అయితే ఉన్నత విద్య నైపుణ్యం కలిగి అమెరికాలో చదువుకున్న చురుకైన విదేశీ విద్యార్థులకు హెచ్1బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ వీసాదారుల వల్ల ఇతర అమెరికా ఉద్యోగులు కార్మికుల పనితీరు పని ప్రదేశం పై ఎలాంటి ప్రతి కూల ప్రభావం పడకుండా చూడాలని స్పష్టం చేశారు.

ఇక అవుట్ సోర్సింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని బిల్లులో ప్రతిపాదించారు. వీరు తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం పెద్ద సంఖ్యలో హెచ్1బీ ఎల్1 ఉద్యోగులను దిగుమతి చేసుకొని తిరిగి వారిని సొంత దేశానికి పంపుతూ తక్కువ జీతాలు ఇస్తూ అమెరికన్ల ఉద్యోగాలకు ఎసరు తెస్తున్నారని బిల్లులో పేర్కొన్నారు. ఈ కంపెనీల్లో సగం మందికంటే ఎక్కువ హెచ్1 బీ వీసాదారులను నియమించుకోవడాన్ని నిషేధించారు.

ఇక నుంచి ఉద్యోగుల నియామకాలు వీసా నిబంధనల విషయంలో కంపెనీల యాజమాన్యాలు నిబంధనల ప్రకారం నడిచేలా చూసే హక్కులు అధికారాలు లేబర్ డిపార్ట్ మెంట్ కు కల్పిస్తూ బిల్లులో కట్టబెట్టారు. శిక్షలు వేసే అధికారం ఇచ్చారు. కంపెనీలన్నీ హెచ్1 ఎల్1 వీసాదారుల వివరాలు అందజేయాలని బిల్లులో స్పష్టం చేశారు.

ఇక ఎల్1 ఉద్యోగులకు కనీస వేతన నిర్ధారణ కంపెనీలపై సమీక్షించేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి బిల్లులో అధికారం కట్టబెట్టారు.
× RELATED షాకింగ్... శ్రామిక్ రైళ్లలో 80 మంది వలస కూలీలు మృతి
×