'ఎఫ్ 3' ప్లానింగ్ లో డైరెక్టర్ కి నిరాశే ఎదురుకానుందా...?

2020 ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రెజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు అనిల్ రావిపూడి. కమెర్షియల్ సినిమాలకి తనదైన కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పించడం డైరెక్టర్ అనిల్ స్టైల్. ఫస్ట్ సినిమా 'పటాస్' నుంచి 'సరిలేరు నీకెవ్వరు' వరకూ వరుస విజయాలతో దూసుకుపోతూ అపజయం అంటే ఎరుగని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. కాగా గతేడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ - మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం 'ఎఫ్ 2'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. తమన్నా మెహరీన్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా వంద కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమా ఎండ్ కార్డులోనూ సీక్వెల్ 'ఎఫ్ 3' ప్లాన్స్ వున్నట్టు హింట్ ఇచ్చిన దర్శకుడు ప్రస్తుతం అదే పనిలో బిజీగా వున్నాడు.

ప్రస్తుతం ఒంగోలు ప్రాంతంలోని తన స్వగ్రామంలో తన టీమ్ మెంబెర్స్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు అనిల్ రావిపూడి. స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా ఫినిషింగ్ స్టేజికి వచ్చేసిందట. ఇదిలా ఉండగా 'ఎఫ్ 3' సినిమాని అక్టోబర్ నెలాఖరున స్టార్ట్ చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ లేవని.. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక హీరో అయిన వెంకటేష్ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'నారప్ప' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే 'నారప్ప' సినిమా పూర్తి చేసిన తర్వాతే 'ఎఫ్ 3' షూటింగ్ లో పాల్గొంటానని వెంకటేష్ చెప్పేశాడట. దీంతో అక్టోబర్ కి షూటింగ్ స్టార్ట్ చేసి సంక్రాంతి బరిలో నిలపాలనుకున్న అనిల్ రావిపూడికి నిరాశే ఎదురైంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. 'ఎఫ్ 3' సినిమాని కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ ఉండబోతోందని అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో కూడా తమన్నా మెహరీన్ లు ఉంటారని కూడా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేసాడు.
× RELATED నాన్నా.. అంటూ టచ్ చేసిన సూపర్ స్టార్!
×