'మామయ్య'కి బర్త్ డే విషెస్ చెప్పిన సూపర్ స్టార్...!

తెలుగు సినిమాని అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన దర్శకుడు రాఘవేంద్ర రావు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన రాఘవేంద్రరావు నవరసాలు కలబోసిన చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు. అందుకే ఆయన దర్శకేంద్రుడు అయ్యాడు. హీరో హీరోయిన్స్ ని తెరపై ఎంత అందంగా చూపించాలో.. ఏ కెమెరా యాంగిల్స్ లో చూపించాలో ఆయనకు తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు అనడంలో అతిశయోక్తి లేదు. టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోలందరితో సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ఈ జనరేషన్ హీరోలతో కూడా సినిమాలు రూపొందించాడు. శోభన్ బాబు హీరోగా నటించిన 'బాబు' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెస్ చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకి బర్త్ డే విషెస్ చెప్పారు. మహేష్ బాబుని టాలీవుడ్ కి హీరోగా 'రాజకుమారుడు'తో ఇంట్రడ్యూస్ చేసింది దర్శకేంద్రుడే.

మహేష్ బాబు ట్విట్టర్ లో ఆయనకు విషెస్ చెప్తూ వారిద్దరూ కలిసి పనిచేసిన 'రాజకుమారుడు' మూవీ ఆన్ లొకేషన్ పిక్ షేర్ చేసారు. ''హ్యాపీ బర్త్ డే మామయ్య... మీ లాంటి జీనియస్ డైరెక్టర్ తో పనిచేసిన గొప్ప అనుభూతి ఎప్పటికీ మరిచిపోలేను.. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని ట్వీట్ చేసారు. కాగా మహేష్ ఈ ట్వీట్ లో దర్శకుడు రాఘవేంద్రరావుని 'మామయ్య' అని సంబోధించడం విశేషం. వాస్తవానికి మహేష్ ఎప్పుడూ రాఘవేంద్రరావుని 'మామయ్య' అని.. రాఘవేంద్రరావు మహేష్ బాబుని 'అల్లుడు' అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని వీరిద్దరూ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'రాజకుమారుడు' సినిమా రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రీతి జింటా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అశ్వినీ దత్ నిర్మించారు. ఈ మూవీలో కృష్ణ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ కి గట్టి పునాది వేసింది దర్శకుడు రాఘవేంద్ర రావు అని చెప్పవచ్చు.
× RELATED అమ్మికి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ముద్దులాట ఓ లెక్కా!
×