డాక్టర్ సుధాకర్ తల్లి ఇప్పుడెందుకు హాట్ టాపిక్ గా మారారు?

ప్రపంచాన్ని వణికిస్తున్న మాయదారి రోగం కంటే కూడా.. మరికొన్ని అంశాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. గడిచిన కొద్ది రోజులుగా డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ సంచలనంగా మారింది. ఈ అంశం కాస్తా హైకోర్టుకు వెళ్లటం.. అక్కడ ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఊహించనిరీతిలో హైకోర్టు తీవ్రంగా రియాక్టు కావటం.. ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. డాక్టర్ సుధాకర్ కు అయిన గాయం ఒకటి మాత్రమేనని ప్రభుత్వం చెబితే.. అందుకు భిన్నంగా వాస్తవాలు కోర్టు ముందుకు వెళ్లటంతో న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే డాక్టర్ సుధాకర్ ను ఆమె తల్లే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించారు. పెద్ద వయస్కురాలైన ఆమె.. ఆవేదన వ్యక్తం చేస్తూ.. కొడుకు ఎంత చెడ్డవాడైనా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ అతడ్ని కొట్టాలని ఏ అమ్మ అయినా చెబుతుందా? అని సూటిగా ప్రశ్నించటం ద్వారా పోలీసుల్ని ఇరుకున పడేశారు.

తన కొడుకు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తనకెంత ఊరటనిచ్చాయన్న విషయాన్ని ఆమె మాటలే చెప్పేస్తాయి. నా కొడుకు ఉన్న పరిస్థితిని చూస్తే ఎంతో బాధగా ఉంటుందన్న ఆమె.. ఏ తల్లికైనా ఇలాంటి పరిస్థితే ఉంటుందన్నారు. చదువుకున్న తన కొడుక్కే ఇలాంటి దుస్థితి తీసుకొచ్చిన వేళలో.. మిగిలిన వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందన్న ఆమె ప్రశ్న చాలా మందిని టచ్ చేసేలా ఉంది.

తాను పోలీస్ స్టేషన్ కు వెళ్లినప్పుడు సుధాకర్ ను కొట్టాలని చెప్పటానికే వచ్చారు కదా.. అని పోలీసులు అన్నారని.. అసలే బాధలో ఉన్న తల్లిని అడగాల్సిన ప్రశ్నేనా? వారికి అమ్మలున్నారు కదా? ఇలాంటి ప్రశ్నలు వేయొచ్చా? అంటూ ఆమె సంధిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి.
× RELATED అమెరికా లక్ష మరణాలు.. చైనాకు ట్రంప్ భారీ షాక్
×