శవాలతో మాయదారి రోగం అంటదన్న ముంబయి కోర్టు

మాయదారి రోగానికి సంబంధించి వాస్తవాల కంటే కొన్ని అపోహలు చాలా మందిలో పాతుకు పోయాయి. ఎండల తీవ్రత పెరిగిన వెంటనే.. మహమ్మారి తోక ముడుచుకుపోతుందన్న మాట అదే పనిగా వినిపించేది. వేసవి మొదలు కావటమే కాదు.. ఎండలు మండుతున్నా.. మాయదారి రోగం అంతకంతకూ విస్తరించటమే తప్పించి తగ్గని దుస్థితి. దీంతో.. ఎండల తీవ్రత పెరిగితే వ్యాప్తి ఆగి పోతుందన్న మాట ఇటీవల కాలంలో ఎవరి నోటి నుంచి రావట్లేదు. ఈ తరహాలోనే మరో అపోహ బలంగా నాటుకు పోయింది.

మాయదారి రోగంతో మరణించిన వారితో మిగిలిన వారిని అంటుకునే అవకాశం ఉందన్న మాట ఎప్పటి నుంచో వింటున్నదే. అయితే.. దీనికి భిన్నమైన వాదనను వినిపించింది ముంబయి హైకోర్టు. శవాలతో వ్యాప్తి చెందుతుందని నిరూపించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటూ ఆసక్తికర వ్యాఖ్యను చేసింది కోర్టు.  ఇంతకీ కోర్టు ఇలాంటి వ్యాఖ్యను ఎందుకు చేసిందన్న విషయంలోకి వెళితే.. ముంబయి మహానగరంలో మాయదారి రోగానికి బలైన వారి డెడ్ బాడీస్ ను పూడ్చేందుకు కొత్తగా కొన్ని శశ్మాన వాటికల్ని గుర్తించాల్సి వచ్చింది.

ఇందులో భాగంగా 20 శశ్మానవాటికల్ని గుర్తిస్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ ప్రదీప్ గాంధీ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. మృతదేహాలతో మాయదారి రోగం వ్యాప్తి చెందుతుందనటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్న కోర్టు.. శశ్మాన వాటికల్ని గుర్తించే అధికారం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు ఉందని స్పష్టం చేసింది. అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన విధి విధానాల్ని ఫాలో అవుతూ.. అంత్యక్రియల్ని నిర్వహించాలని స్పష్టం చేసింది.
× RELATED ప్రధానికి కేసీఆర్ లేఖ: విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణకు డిమాండ్
×