అరవ రాజ్యంలో కోయంబేడు కలకలం

కోవిడ్ మనకు ఎన్ని సమస్యలు తెచ్చిందో  అంతకుమించి గుణపాఠాలు నేర్పుతోంది. మనం బేసిగ్గా చిన్న చిన్న విషయాలను చాలా నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ అవి ఎంత ప్రమాదమో పట్టించుకోం. అలాంటి ఒక పొరపాటు... ఇపుడు తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. అంతేకాదు ఆంధ్రాను కూడా అల్లాడిస్తోంది.

తమిళనాడులో ఈరోజు 786 కేసులు రాగా మొత్తం కేసులు 14753 గా నమోదయ్యాయి. అయితే... తమిళనాడును కోవిడ్ కు బలిచేసిన రెండు ఘటనలు ఒకటి మర్కజ్ కాగా మరోటి కోయంబేడు మార్కెట్. కోయంబేడు కూరగాయల మార్కెట్  ఆసియాలోనే అతి పెద్ద వాటిలో ఒకటి.  చెన్నై మెట్రో పాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో నడిచే ఈ మార్కెట్ ఎంత పెద్దదంటే సుమారు 2 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ సుమారు 1200 పైగా షాపులు ఉన్నాయి.  200 కు పైగా హోల్ సేల్ షాపులు మరో వెయ్యికి పైగా రిటైల్ దుకాణాలుంటాయిక్కడ.  తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తారు. రోజుకు 5 వేల టన్నుల కూరగాయలు వస్తాయిక్కడికి.

గత కొద్దిరోజులుగా తమిళనాడులో ఏపీలో ఈ కోయంబేడు లింకులు బాగా ఎక్కువగా బయట పడుతున్నాయి. ఈ మార్కెట్ వల్ల ఒక్క చిత్తూరులోనే 150 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం చేసిన పొరపాటు ఏంటంటే... ఇంత పెద్దసమూహాలు హాజరయ్యే ఈ మార్కెట్ ను మూసేయలేదు. లాక్ డౌన్ లోను నిత్యావసరాల కింద తెరిచే ఉంచారు. కానీ జాగ్రత్తల్లో విఫలమయ్యారు. దీంతో ఈ మార్కెట్ కు లింకున్న కేసులు బాగా పెరిగిపోయాయి. విచిత్రం ఏంటంటే... గోదావరి జిల్లాల నుంచి కూడా ఈ మార్కెట్ కి వెళ్లొచ్చి కొందరు కరోనా బారిన పడ్డారు. ఎట్టకేలకు దీనిని మూసివేశారు. నాలుగు వేర్వేరు ప్రాంతాలకు దీనిని తాత్కాలికంగా తరలించారు.

ఇదిలా ఉండగా... కరోనా మరణాలను  కేరళతో పాటు తమిళనాడు కూడా బాగా అదుపుచేస్తోంది. 1600 కేసులు వచ్చిన తెంగాణలో 45 మంది చనిపోతే... 15000 కేసులు వచ్చిన తమిళనాడులో 98 మంది మృతి చెందారు. 
× RELATED ప్రధానికి కేసీఆర్ లేఖ: విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణకు డిమాండ్
×