భార్యభర్తల మధ్య చిచ్చు రేపిన గూగుల్ మ్యాప్

ఒక కాపురంలో నిప్పులు పోసింది గుగులమ్మ. అసలే అనుమానపు భార్య. దానికి గూగులమ్మ తోడు కావటంతో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. వినేందుకు విచిత్రంగా అనిపించినా.. ఇలాంటి కాపురాలు కూడా ఉంటాయన్న విషయాన్ని తెలిసేలా చేసిన ఈ ఉదంతంలోకి వెళితే..
తమిళనాడు మయిలదుత్తురాయిలోని లాల్ బహదూర్ నగర్ లో తన భార్యతో కలిసి చంద్రశేఖరన్ నివాసం ఉంటున్నాడు. ఆమెకు కాస్త అనుమానం ఎక్కువ. ఆ మాట అనే కన్నా ముందుచూపు ఎక్కువని చెబితే బాగుంటుందేమో? రోజూ ఆఫీసు నుంచి భర్త వచ్చినంతనే అతగాడి మొబైల్ ఫోన్ తీసుకోవటం.. చెక్ చేస్తుండేది. ఆ రోజంతా తన భర్త ఎక్కడెక్కడకు తిరిగారన్న విషయాన్ని గూగుల్ మ్యాప్స్ లోని యువర్ టైమ్ లైన్ సెక్షన్ లోకి వెళ్లి చెక్ చేస్తుండేది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆఫీసుకు వెళ్లి వచ్చిన తన భర్త చేతి నుంచి ఎప్పటిలానే మొబైల్ తీసుకున్న ఆమె.. కాసేపటికే పెద్ద ఎత్తున గొడవ చేయటం షురూ చేసింది. ఎందుకిలా అంటే.. రోజువారీగా తన భర్త వెళ్లాల్సిన ప్రాంతాలకు భిన్నంగా వేరే ప్రాంతాల్ని కూడా చూపటంతో ఆమె అనుమానం మరింత ఎక్కువైంది. దీంతో.. భార్యభర్తల మధ్య రచ్చ మొదలైంది.

భార్య అనుమానాన్ని గుర్తించిన చంద్రశేఖరన్.. గూగుల్ మ్యాప్స్ ను చెక్ చేయగా.. ఆ రోజు తాను వెళ్లని ప్రాంతాల్ని కూడా వెళ్లినట్లు చూపించిన వైనాన్ని గుర్తించారు. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. మే 20న గూగుల్ మ్యాప్ లో చూపించిన తన టైమ్ లైన్ లో తాను వెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లినట్లుగా తప్పుడు సమాచారాన్ని చూపినట్లుగా కంప్లైంట్ ఇచ్చారు. గూగుల్ మ్యాప్స్ కారణంగా తన సంపారంలో గొడవలు షురూ అయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జరిగిన నష్టానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మరి.. దీనికి గూగులమ్మ ఏం బదులిస్తుందో చూడాలి.
× RELATED అమెరికా లక్ష మరణాలు.. చైనాకు ట్రంప్ భారీ షాక్
×