భారీ నష్టాలలో పాన్ ఇండియన్ మూవీ.. ఆపేస్తారా..?

తమిళనాట 1996లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా 'ఇండియన్'. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 'భారతీయుడు' పేరుతో తెలుగులో విడుదలై బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. అవినీతిని అరికట్టించే ఓ సామాన్యుడి ప్రణాళికల ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్ గా డైరెక్టర్ శంకర్.. తాజాగా కమల్ హాసన్ హీరోగా 'ఇండియన్ 2' సినిమాను రూపొందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడైతే ప్లాన్ చేసారో అప్పటినుండి ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉంది. ఈ సినిమాను ఒకదానివెంట మరో సమస్య వెంటాడుతూనే ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అవాంతరాలు ఘోరంగా ఎదురవుతున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి ఘోరమైన ప్రమాదం వాటిల్లి ప్రాణనష్టం జరిగింది. ఆ ప్రమాదం నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభిద్దాం.. అనుకునేలోపు కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిపివేయడం జరిగింది. లాక్ డౌన్ వల్ల మిగతా షెడ్యూల్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటికే 10కోట్ల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ లో సినిమాను విడుదల చేస్తామని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. ఈ సినిమా ఎదుర్కొంటున్న ప్రమాదాల కారణంగా అసలు సినిమా పూర్తవుతుందా..? అనే ప్రశ్న అభిమానులలో రేకెత్తుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇన్ని ఆటంకాల మధ్య నష్టాలతో షూటింగ్ చేసే బదులు సినిమాను ఆపేస్తే మంచిదని.. సినీ వర్గాల టాక్. చూడాలి మరి ఇండియన్-2 టీమ్ ఎలాంటి నిర్ణయంతో ముందుకు సాగనుందో..!
× RELATED సర్కారు వారి పాట.. స్టోరీలైన్ అదుర్సే!
×