ట్రంప్ అంతే: భారత్ కు మొన్న బెదిరింపులు..నేడు ప్రశంసలు

ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా పిలవడుతున్న అమెరికా ఎప్పుడు బెదిరించో లేదా.. భయపెట్టో.. తీవ్ర ఆంక్షలు విధించో ఇతర దేశాలను చెప్పుచేతుల్లోకి తెచ్చుకునేలా వ్యవహరిస్తోంది. ఆ దేశం మొదటి నుంచి అదే వైఖరి అవలంభిస్తోంది. తాజాగా కరోనా వైరస్ విషయంలోనూ అదే ప్రవర్తన ప్రదర్శిస్తోంది. తీరు మార్చుకోకపోవడంతో తమ దేశ ప్రజలే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కరోనాను నివారించలేని స్థాయికి వెళ్లింది. ఈ క్రమంలో కరోనా వైరస్ నివారణకు వాడే హైడ్రాక్సి క్లోరొక్విన్ మందు విషయమై భారత్‌ను అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ సహాయం కోరాడు. అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరాకరించాడు. దీంతో ట్రంప్‌కు మండింది. భారత్ సహాయం చేయకపోతే ప్రతీకార చర్యలకు దిగుతామని హెచ్చరించాడు. అంటే అందితే కాళ్లు.. అందకపోతే జుట్టు అనే తీరులో ప్రవర్తించాడు.

అయితే ఇతర దేశాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశం మానవతా దృక్పథం చూపిస్తూ ఆ మందు ఎగుమతులు చేసేందుకు అంగీకరించింది. అందులో భాగంగా అమెరికాకు కూడా ఆ మందును ఎగుమతి చేసేందుకు పచ్చజెండా ఊపింది. భారత్ తీసుకున్న నిర్ణయం పై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఏకంగా భారతదేశం పై ప్రశంసల వర్షం కురిపించాడు.

కరోనా వైరస్ మహమ్మారి పై కలిసికట్టుగా విజయం సాధిద్దామంటూ ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి పిలుపునిచ్చారు. కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో భారత్ తరపున సాధ్యమైనవన్నీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్ (హెచ్‌సీక్యూ) మాత్రల ఎగుమతి పై నిషేధం సడలించడం పై ప్రధాని మోదీకి ట్రంప్ ట్విటర్ లో కృతజ్ఞతలు చెప్పారు. అద్భుతమైన నాయకుడు ప్రధాని మోదీ అంటూ ట్రంప్ ప్రశంసించారు. ఇలాంటి విపత్కర సమయంలో భారత్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేనిదిగా ట్రంప్ వ్యాఖ్యానించారు.

‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇలాంటి పరిస్థితులు మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్-అమెరికా బంధం ఎప్పటికీ దృఢంగా ఉంటుంది. కోవిడ్-19పై మానవాళి పోరాటంలో భారత్ సాధ్యమైన ప్రతి సహాయం చేస్తుంది. కలిసికట్టుగా ఈ పోరాటంలో మనం విజయం సాధించాలి..’’ అని ట్రంప్ ట్విట్టర్ కు బదులిచ్చారు. సహాయం చేసినందుకు నేడు ప్రశంసించగా.. మొన్న ఎగుమతి చేయలేమని చెప్పడంతో బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ విధంగా అమెరికా వ్యవహరించే తీరు ఉంది.

× RELATED టీ-20 ప్రపంచకప్ వాయిదా.. ఐపీఎల్‌కు సుగమం.. పాకిస్థాన్ ఆగ్రహం
×