ఎర్రగడ్డ పిచ్చాస్పత్రికి మందుబాబుల క్యూ

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో పెద్ద పెద్ద వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు సూపర్ మార్కెట్లు సహా అన్నీ దుకాణాలు మూసేసి ఉన్నాయి. ఈ క్రమంలో మత్తు పదార్థాలు అందించే దుకాణాలు కూడా బందయ్యాయి. అంటే మద్యం - కల్లు దుకాణాలు కూడా. దీంతో మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. హఠాత్తుగా లాక్ డౌన్ విధించడంతో వారికి పాలుపోలేదు. ఈ క్రమంలో 24 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు మందు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. బ్లాక్ లో రెట్టింపు ధర చెల్లించి కొందరు మద్యం సేవించారు. అయితే కల్లు తాగేవారు మాత్రం పిచ్చోళ్లుగా మారుతున్నారు. కల్లు దాదాపు మూడు వారాలుగా లేకపోవడంతో వారి మానసిక పరిస్థితి దెబ్బతింది. ఇక మందుబాబులు కూడా మద్యం లభించక వారి పరిస్థితి కూడా ఇదే మాదిరిగా తయారైంది. ఈ క్రమం లో వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రికి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఆస్పత్రి లో చేరుతున్నారు.

రోజుకు వందల సంఖ్యలో ఈ ఆస్పత్రికి క్యూ కడుతుండడంతో ఆస్పత్రి బాధితులతో కిక్కిరిసిపోతోంది. మద్యం దొరక్క మందుబాంబులు పిచ్చెక్కిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకోగా.. మరి కొంతమంది పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో మద్యం దొరక్క వింతగా ప్రవర్తిస్తున్న వారిని హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 800కు పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఇలాంటి కేసులు 98 శాతం పెరిగాయని ఆ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.  అలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన వారికి వైద్యం సత్వరమే అందిస్తున్నారు. వైద్యం పొంది కోలుకున్న వారిలో వంద మంది డిశ్చార్జ్ అయ్యారు.

మద్యానికి బానిసైనవారు ఒక్కసారిగా మద్యాన్ని ఆపితే 24 గంటల్లోనే ఆ ప్రభావం వారిపై తీవ్రంగా ఉంటుంది. అందుకే వారు వింతగా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలోనే బుధవారం ఒక్క రోజులోనే 200 మంది ఈ ఆస్పత్రిలో చేరారు. రోజురోజుకు ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.


× RELATED ట్రంప్ ట్విటర్ మధ్య యుద్ధం.. ఘాటుగా స్పందించిన సీఈఓ
×