లాక్ డౌన్ పొడిగింపు పక్కా: ఆర్టీసీ కీలక నిర్ణయం

ప్రస్తుతం లాక్ డౌన్ పొడిగింపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే లాక్ డౌన్ పొడగింపు ఉండేలా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కనిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలో పలు గ్రామాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్ డ్ టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను నిలిపివేయాలని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ నిర్ణయించింది. వాస్తవంగా ఏప్రిల్ 14వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుందని అందరూ భావించారు.

అయితే కరోనా వైరస్ కేసులు ఇంకా పెరుగుతూనే ఉండడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాక్ డౌన్ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ గడువు పొడిగిస్తారని విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ లాక్ డౌన్ ముగుస్తుందనే భావనతో బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా నాలుగు రోజులుగా ఆన్ లైన్ రిజర్వేషన్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ వరకు ఆర్టీసీ టికెట్ల రిజర్వేషన్ ను అధికారులు ప్రారంభించారు. దీంతో హైదరాబాద్ తోపాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు భారీగా రిజర్వేషన్లు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆరు రోజులకు వివిధ ప్రాంతాలకు కలిపి 42377 టికెట్లు ఇప్పటికే బుక్ చేసుకున్నారు. ఇవి కూడా కేవలం సూపర్ లగ్జరీ - అల్ట్రా డీలక్స్ బస్సులకు మాత్రమే. సాధారణ బస్సులు పెట్టి ఉంటే ప్రజలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగించేందుకు సిద్ధమయ్యారు.

ఈక్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరడం.. కేంద్రం కూడా లాక్ డౌన్ పొడగింపును పరిశీలిస్తుండడంతో ఏపీఎస్ ఆర్టీసీ వెనక్కి తగ్గింది. లాక్ డౌన్ పొడగించే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో రిజర్వేషన్లు రద్దు చేసేసింది. ఒకవేళ దేశంలో పొడిగించకున్నా తెలంగాణలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పొడగించే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసింది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారికి పూర్తి సొమ్ము తిరిగి చెల్లించేందుకు రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ విధంగా రిజర్వేషన్లు రద్దు చేసుకోవడంతో లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. మరికొన్నాళ్ల పాటు ఇంటికే పరిమితమయ్యే అవకాశం ఉందని స్పష్టత వచ్చింది. ఒకవేళ మరికొన్నాళ్లు సాగితే ఇన్నాళ్లు పాటించినట్టే ప్రజలు ఇళ్లకే పరిమితమై కరోనా రహిత భారతదేశం రూపుదిద్దుకునేలా సహకరించాలని ఆర్టీసీ కోరుతోంది.


× RELATED టీ-20 ప్రపంచకప్ వాయిదా.. ఐపీఎల్కు సుగమం.. పాకిస్థాన్ ఆగ్రహం
×