కరోనాపై వార్ కోసం ట్రంప్ బడ్జెట్ లెక్క తెలిస్తే షాకే..

చైనాలోని వూహాన్ మహానగరంలో పుట్టి.. మిగిలిన దేశాల నిర్లక్ష్యం.. అజాగ్రత్త.. ముందుచూపు లేమి.. సమస్య తీవ్రతను గుర్తించటంలో జరిగిన తప్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చేసిన పొరపాట్లకు ఆయా దేశాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. కొన్ని దేశాలకు.. దేశాలే ఎప్పటికి కోలుకుపోతాయో అర్థం కాని దుస్థితి. ఆ కోవలోకే చేరింది ప్రపంచానికి పెద్దన్న అమెరికా. ఆ దేశంలోని మహా నగరాల్లో ఒకటైన న్యూయార్క్ ఇప్పుడు వూహాన్ పరిస్థితిని తెచ్చేసుకున్న దుస్థితి. పలు రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. దీని బారి నుంచి తప్పించుకోవటానికి అగ్రరాజ్యం కిందా మీదా పడుతోంది.

చైనీస్ వైరస్ అంటూ.. కరోనా పిశాచి పేరును మార్చేలా.. ప్రపంచ దేశాల్లో దాని ఇమేజ్ మరోలా ఉండేలా చేయటానికి ట్రంప్ పడిన శ్రమకు బదులుగా.. తమ దేశాన్ని ఆ వైరస్ బారిన పడకుండా చేయటంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే.. ఈ రోజు పరిస్థితి మరోలా ఉండేది. అగ్రరాజ్యమంటే.. ప్రపంచ దేశాలకు భయం ఉంటుంది కానీ.. కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉండే కరోనా వైరస్ కు భయం ఎందుకు ఉంటుంది?

ఎవరు తనకు దగ్గరగా వస్తే.. వారిలోకి మొహమాటం లేకుండా ఎక్కేసే అలవాటున్న కరోనాకు అమెరికా.. దాని అధ్యక్షుడు ట్రంప్ లాంటివేమీ అస్సలు తెలీదు కదా? నిజానికి ఈ గుణమే.. ఇప్పుడా దేశానికి శాపంగా మారింది. తాను ఇప్పటికి కళ్లు తెరవకుంటే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించిన ట్రంప్ తాజాగా భారీ ప్యాకేజీని ప్రకటించింది.

వైట్ హౌస్ తో పాటు.. దేశంలోని రెండు ప్రధాన పార్టీల నేతలు కలిసి అత్యవసర నిర్ణయాన్ని ఉమ్మడిగా ప్రకటించారు. ఈ వైరస్ కట్టడితో పాటు.. ఈ మహమ్మారి కారణంగా ప్రభావం పడే వివిధ రంగాలను ఆదుకునేందుకు ఏకంగా రెండు ట్రిలియన్ డాలర్ల రెస్య్కూ బిల్లుకు ఆమోదం తెలిసిందే. రెండు ట్రిలియన్ డాలర్లు అంటే ఆషామాషీ యవ్వారం కాదండోయ్. దీన్ని మన రూపాయిల్లో లెక్క కడితే.. ఏకంగా 150 లక్షల కోట్లు సుమా.

ఈ భారీ ప్యాకేజీలో భాగంగా అమెరికాలోని అత్యధిక శాతం నేరుగా డబ్బునే ఇవ్వనున్నారు. చిన్న వ్యాపారుల్ని ఆదుకునేందుకు 27.52 లక్షల కోట్లు ఇస్తుండగా.. ఇంటికే పరిమితమైన ఉద్యోగులందరికి జీతాలు ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. అంతేనా.. పెద్ద సంస్థల గ్యారెంటీకు.. సబ్సిడీల కోసం రూ.37.5లక్షల కోట్లు కేటాయించారు. ఎయిర్ లైన్స్ సంస్థల్ని ఆదుకోవటం.. ఆసుపత్రులకు భారీ ఎత్తున ఖర్చు చేయనున్నారు.

చరిత్రలో ఇప్పటివరకూ లేని రీతిలో ఈ ప్యాకేజీ ద్వారా అమెరికాలోని ప్రతి వ్యక్తికి 1200 డాలర్లు.. పిల్లలకు 500 డాలర్లు ఇవ్వనున్నారు. దీన్ని మన రూపాయిల్లో చూస్తే.. పెద్ద వారికి రూ.90వేలు.. చిన్న పిల్లలకురూ.37500 అన్న మాట. అది కూడా ఈ మొత్తం ఒకేసారి ఇవ్వనున్నారు. ఇంత భారీ అమౌంట్ ఇస్తున్న అమెరికా.. దీన్ని తిరిగి వసూలు చేసేందుకు.. రానున్న రోజుల్లో ప్రపంచం మీద ఏ రీతిలో విరుచుకు పడుతుందో చూడాలి. ఏమైనా.. పెద్దన్న బొక్కసం నుంచి ఇంత భారీగా నిధుల్ని బయటకు తీసేలా చేయటంలో కరోనా వైరస్ అద్భుతమై విజయాన్ని సాధించిందని చెప్పక తప్పదు.
× RELATED కరోనా ఎఫెక్ట్..మాంద్యంతో పాటు ఆహార సంక్షోభం కూడా!
×