అందాల రాక్షసి రెండో హీరోయిన్ గానా?

గత కొంత కాలంగా కెరీర్ లో స్పీడ్ లేక డైలమాలో ఉంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. పెద్ద స్టార్లతో ఛాన్సులైతే లేనే లేవు. ఆ క్రమంలోనే ఇటీవల అనూహ్యంగా జాక్ పాట్ తగిలిందని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే ఆఫర్ ఈ క్యూటీని వరించిందని అన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందే `వకీల్ సాబ్`లో పవన్తో ఈ బొమ్మ రొమాన్స్ కి దిగబోతున్నట్టు వినిపించింది. త్వరలోనే పవన్- లావణ్య జోడిని తెరపై చూడొచ్చని ఇద్దరి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ ఈ జోడి ఇప్పట్లో కనిపించేలా లేదు. వీరిద్దరిని చూడాలంటే మరో ఏడాది పాటు ఆగాల్సిందే. ఎందుకంటే పవన్ తో లావణ్య నటించేది `వకీల్ సాబ్`లో కాదట. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఈ సెక్సీ భామని ఓకే చేసినట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్`తో రీఎంట్రీ ఇస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్`కి రీమేక్గా రూపొందిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్రాజు నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి- నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతోపాటు పవన్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కమర్షియల్ హంగులను కూడా చేర్చాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే పవన్ సరసన ఆడిపాడేందుకు ఇద్దరు హీరోయిన్లని తీసుకోవాలనుకున్నారు. ఓ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ పవన్ ఈ సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం.. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా లావణ్యని ఫైనల్ చేసినట్టు టాక్. మొదట ఇందులో శృతి హాసన్ తీసుకోబోతున్నారని.. `గబ్బర్ సింగ్` కాంబినేషన్ ని రిపీట్ చేయాలని భావించారట. కానీ తాజాగా లావణ్య పేరు తెరపైకి రావడం విశేషం. మరి శృతి కూడా  ఉంటుందా? లేక లావణ్యతోనే సరిపెట్టుకుంటారా? అనేది చూడాలి. ఇక లావణ్య ఇటీవల `అర్జున్ సురవరం`తో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇటీవలే తమిళంలో అధర్వ సరసన నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ సరసన `ఏ1 ఎక్స్ ప్రెస్`లో నటిస్తోంది. స్పోర్ట్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఈ భామ హాకీ ప్లేయర్ గా కనిపించబోతుంది.
× RELATED కరోనా వచ్చి ఆ హీరోకి కెరీర్ లేకుండా చేసిందా..?
×