కేసీఆర్ అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా బయటకు రాలేదే?

‘నేను సూటిగా అడుగుతున్నా. ఇలాంటివేళ.. టీఆర్ఎస్ నేతలు బయటకు రావొద్దా? ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ప్రజలకు మార్గదర్శకం చేయటం ఉండదా? పోలీసులకు సహకారం అందివ్వొద్దా?’’ అంటూ సూటిగా ప్రశ్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని మర్చిపోలేం. అంతేకాదు.. కరోనా వేళ..నేతలు ఏమేం చేయాలన్న విషయంపై క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో బుధవారం రోడ్ల మీదకు టీఆర్ఎస్ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఇతర ప్రజాప్రతినిదులు రోడ్ల మీదకు వచ్చి తమ బాధ్యతల్ని నిర్వర్తించే ప్రయత్నం చేస్తారని భావించారు.

కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ మాటకు స్పందించి.. రోడ్ల మీదకు వచ్చిన ప్రజాప్రతినిదులు కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. ఎవరికి వారు కరోనాకు ఎఫెక్ట్ అయ్యే కన్నా కామ్ గా కొద్దిరోజులు ఇళ్లకే పరిమితం కావాలన్న ధ్యాస కనిపించింది. ముఖ్యమంత్రి నోరు తెరిచి మరీ చెప్పిన తర్వాత బయటకు రాకుంటే బాగుండదన్న ఉద్దేశంతో.. వచ్చామా? వెళ్లామా? అన్నట్లు వ్యవహరించారే తప్పించి ఒళ్లు వంచి.. శ్రమించిన వారు పది నుంచి పదిహేను శాతానికి మించి లేరని చెబుతున్నారు.

అధికారాన్ని చెలాయించే విషయంలో పోటీ పడే పలువురు నేతలు.. పదవుల కోసం పాకులాడే విషయంలో ఏ మాత్రం తగ్గని వారు.. కరోనా లాంటి కల్లోల పరిస్థితుల్లో బయటకు వచ్చి.. ప్రజలకు అవగాహన కల్పించటం.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని తూచా తప్పకుండా అమలు అయ్యేలా చేయటంలో ఫెయిల్ అయ్యారనే చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు.. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు తమ అధినేత కేసీఆర్ కంటే కూడా కరోనా అంటేనే ఎక్కువ భయమన్నట్లుగా వారి తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.
× RELATED అమెరికాకి చురకలు అంటించిన డబ్ల్యూహెచ్ ఓ..ఏమైందంటే!
×