తెలంగాణలో కూడా ఏపీ మాదిరి 1092 అవసరం ఉంది కేసీఆర్

ఓవైపు ప్రాణం పోయే పరిస్థితి. మరోవైపు.. ఆ సందర్భంలోనూ డబ్బుల్ని ఏదోలా సంపాదించుకోవాలన్న కక్కుర్తి. ఇప్పుడు పోగుపోసే సంపదతో ఏమీ చేయలేమని.. కరోనా లాంటి వాటిని అస్సలు అడ్డుకో లేమన్న ఇంగితాన్ని మర్చిపోయి.. అత్యవసర వేళలోనూ ఆరాచకం చేస్తున్న వ్యాపారులకు ముకుతాడు వేసేందుకు ఏపీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

కరోనా వేళ.. నిత్యవసర వస్తువులకు పెరిగే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు ముందు జాగ్రత్తగా సరుకుల్ని కొని పెట్టుకుంటున్నారు. వివిధ కారణాలతో ఆలస్యమైన వారు అందుకు భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. కూరగాయలు.. నిత్యవసర వస్తువుల ధరల్ని అమాంతం పెంచేసి దోచేసుకునే వ్యాపారుల మీద ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొరడా ఝుళిపించారు.

అధిక ధరలకు అమ్మే వ్యాపారుల గురించి 1092 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. అలా వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి.. అందుకు బాధ్యులైన వ్యాపారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించారు ఏపీ ముఖ్యమంత్రి. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు.. కూరగాయలు.. నిత్యవసర వస్తువుల ధరల్ని కలెక్టర్లు టీవీలు.. పత్రికల ద్వారా ప్రకటించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

కట్ చేస్తే.. తెలంగాణలో ఇంత పక్కాగా నిర్ణయాలు తీసుకోనప్పటికీ.. అధిక ధరలకు వస్తువుల్ని అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అధిక ధరలకు వస్తువుల్ని అమ్మే వారి లైసెన్సులు రద్దు చేస్తామని.. చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాటలు చెప్పినంతనే.. బ్లాక్ మార్కెట్ రాయుళ్లలో మార్పులు వచ్చే అవకాశం లేదు. అందుకే.. ఏపీ సర్కారు మాదిరి.. మరింత పక్కాగా నిర్ణయాలు తీసుకోవటం.. టోల్ ఫ్రీనెంబరు ఏర్పాటు చేయటం లాంటివి చేయటం మంచిదంటున్నారు. అంతేకాదు.. నిత్యవసర వస్తువుల్ని ఏ ధరకు అమ్మాలన్న విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని.. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తే మంచిదని చెప్పక తప్పదు.
× RELATED కరోనా ఎఫెక్ట్..మాంద్యంతో పాటు ఆహార సంక్షోభం కూడా!
×