కరోనా అప్డేట్: ప్రపంచవ్యాప్తంగా 4.71 లక్షలు దేశంలో 650

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 471044 మందికి చేరింది.  ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య 21284కు చేరింది. ఇందులో 114228 మంది కరోనా వైరస్ బారి నుంచి రికవరీ అయ్యారు.

దేశాల వారీ గా చూస్తే ఇటలీలో కరోనా మరణ మృదంగం వినిపిస్తోంది.  ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 7503కు చేరింది. మొత్తం కేసులు 74386కు చేరాయి.  ఆ తర్వాత స్థానంలో అమెరికా ఉంది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 68211కు చేరగా.. మరణాలు 1027కు చేరాయి. స్పెయిన్ లో కరోనా కేసులు 49515కు చేరగా.. 3647మంది కరోనా కాటుకు చనిపోయారు.

ఆ తర్వాత వరుసగా జర్మనీలో 37వేల కేసులు ఇరాన్ లో 27వేల కేసులు ఫ్రాన్స్ లో 25వేలు స్విట్జర్లాండ్ లో 10వేల కేసులు సౌత్ కొరియాలో 9137 కేసులు నమోదయ్యాయి.

ప్రధానంగా ఇటలీ స్పెయిన్ ఇరాన్ అమెరికాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కరోనా మరణాల్లో చైనాను తాజాగా స్పెయిన్ కూడా దాటేసింది. స్పెయిన్ లో గడిచిన 24 గంటల్లో 738మంది మరణించడం గుబులు రేపుతోంది.

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్క రోజే అమెరికాలో 10వేల కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. నిన్న ఒక్కరోజే 150 మందికి పైగా మరణించగా.. గురువారం 24గంటల్లో  1059 మంది చనిపోవడం అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది.

ఇక భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 650కు చేరువైంది. 10 మంది దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర కేరళల్లో కరోనా కేసుల సంఖ్య 100 దాటింది. బుధవారం ఒక్కరోజే దేశంలో 94 కేసులు నమోదయ్యాయి.   మహారాష్ట్రలో 119 కేరళలో 114 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 41కు చేరింది. బుధవారం ఓ మూడేళ్ల బాలుడికి ఓ మహిళకు కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది.

గోల్కొండకు చెందిన ఈ కుటుంబం బాలుడితో సహా ఇటీవలే సౌదీ అరేబియా నుంచి వచ్చింది. బాలుడిలో దగ్గు జలుబు లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ బాలుడి తల్లిదండ్రులకు కరోనా వచ్చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 10కి చేరింది. మార్చి 22న అమెరికా నుంచి వచ్చిన 26 విజయవాడ యువకుడికి (22)కి కరోనా సోకింది. 14న ఢిల్లీకి వెళ్లొచ్చిన గుంటూరు వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గుంటూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
× RELATED కరోనా ఎఫెక్ట్..మాంద్యంతో పాటు ఆహార సంక్షోభం కూడా!
×