మోడీని పొగిడి.. భారత్ ను అంత మాట అనేసిన ట్రంప్

ఏ నక్షత్రంలో పుట్టాడో కానీ వివాదాల్ని తన చుట్టూ తిప్పుకోవటంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాతే ఎవరైనా. అదాటున ఎంత మాట అయినా అనేయటం ఆయన నైజం. ఇదే ఆయన్ను మిగిలిన వారికి భిన్నంగా నిలిపేలా చేయటమే కాదు.. అమెరికా అధ్యక్షుడిగా చేసిందేమో? అమెరికా చరిత్రలో ట్రంప్ అంతటి వివాదాస్పద అధ్యక్షుడు మరొకరు కనిపించరు. నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేయటం.. ఎవరైనా.. ఏమైనా అనుకుంటారన్న కనీస ఆలోచన ఆయనలో కనిపించదు.

తనంతటోడు ఏమైనా మాట్లాడే హక్కు ఉంటుందని బలంగా నమ్మే ట్రంప్.. తాజాగా తన భారత పర్యటనకు ముందు కోట్లాది మంది భారతీయుల మనసులు గాయ పరిచేలా మాట అనేశారు. మోడీ మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించటాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ.. ఆ పేరు తో భారతీయుల్ని పుసుక్కున మాట అనేయటమే అసలు సమస్య.

భారత్ మమ్మల్ని బాగా చూడదు. కానీ.. ప్రధాని మోడీ అంటే నాకు చాలా ఇష్టమని ఆయన వ్యాఖ్యానించారు. భారత పర్యటనకు సరిగ్గా నాలుగు రోజుల ముందు ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాట భారతీయులకు ఒళ్లు మండేలా చేస్తోంది. అందునా మోడీని ఇష్టపడనివారికి ట్రంప్ మాటలు కారం రాసినట్లుగా ఉన్నాయని చెప్పాలి. ట్రంప్ తాజా వ్యాఖ్యలు భారత్ కు అవమానమని కాంగ్రెస్ విమర్శిస్తే.. ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా సాధించిన పురోగతి మొత్తాన్ని తాజా వ్యాఖ్య తీసేస్తుందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ట్రంప్ కు స్వాగతం పలకటం కోసం 70 లక్షల మంది ప్రజలు స్వాగతం పలకటానికి ఆయనేమైనా దేవుడా? అంటూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి ప్రశ్నిస్తున్నారు. నిజమే.. ట్రంప్ లాంటి అమెరికా అధ్యక్షుడ్ని స్వాగతించటానికి అంత భారీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు. దేశ ప్రజల్ని చిన్నబుచ్చేలా మాట్లాడి.. తనను పొగిడేసిన ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


× RELATED జై ట్రంప్ ..జైజై ట్రంప్ .. ట్రంప్ తన భక్తుడిని కలుస్తారా !
×