అమెజాన్ - ఫ్లిప్ కార్ట్ లపై కరోనా ఎఫెక్ట్..మరిన్ని ఇబ్బందులు?

ఇప్పటికే ఆన్ డెలివరీల విషయంలో జనాలు అలర్ట్ అవుతున్నారు. ఈకామర్స్ సైట్ల ద్వారా ఏదైనా ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. కరోనా వైరస్ చైనాలో విజృంభిస్తూ ఉండటంతో - అక్కడ నుంచి ఏ సరుకునూ జనాలు డెలివరీ ఆర్డర్ ఇచ్చేందుకు సిద్దంగా లేరు. ఒకవేళ ఏదైనా ఆర్డర్ ఇచ్చినా.. ఇప్పుడు చైనా నుంచి సరకు దిగుమతి కూడా నిషేధం ఉన్నట్టుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డెలివరీ లేనట్టే.

ప్రస్తుతానికి అయితే అదంతా ఒక ఎత్తు. కానీ ఈ నెలాఖరు తర్వాత  పరిస్థితి మరింత గడ్డుగా మారనుందని - ఈ కామర్స్ వెబ్ సైట్లకు అప్పుడే అందుకు సంబంధించి టెన్షన్ పెరుగుతూ ఉందని సమాచారం. ప్రత్యేకించి ఫోన్లు - ల్యాప్ టాప్ లు గట్రా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జనాలు ఈ కామర్స్ సైట్ల మీదే ఆధారపడుతూ ఉన్నారు. ఆన్ లైన్ లో ఆర్డరిచ్చి తెప్పించుకుంటున్నారు.

ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ల విషయంలో అయితే ఇప్పుడు మరింత గడ్డుకాలం తప్పదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్లకు ప్రధాన ఆధారం చైనా. అక్కడే స్మార్ట్ విడి భాగాలన్నీ దాదాపుగా తయారు అవుతున్నాయి. వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది చైనా. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ రంగమే కీలకమైనది. ఇప్పుడు చైనా నుంచి ఇతర దేశాలకు విమానాలే సరిగా ఎగరడం లేదు. చైనా నుంచి వచ్చారంటే  మనిషిని కూడా పురుగును చూసినట్టుగా చూస్తున్నారు బయటి దేశాల వాళ్లు. అలాంటిది ఇప్పుడు చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే ధైర్యం చాలా మందికి లేదు. ఈ ప్రభావం మార్కెట్ మీద పడుతుందని ఆ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి చైనా నుంచి తెప్పించుకుని సరకు డెలివరీ  చేయాల్సిన పరిస్థితి లేదని -ఉన్న స్టాకు అంతా క్లియర్ అయ్యాకే. .ఆయా దేశాల్లో అసలు పరిస్థితి పై స్పష్టత వస్తుందని తెలుస్తోంది.
× RELATED కరోనా ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాలకి పయనమైన చైనా స్టూడెంట్స్!
×