మహిళకు కరోనా వైరస్ నిర్ధారణ -- ఖాళీ అయిన లండన్ 'చైనా టౌన్'

కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతోందని భావించినప్పటికీ - ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి 1383 మంది మృతి చెందారు. ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 65000కు చేరుకున్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న 1700 మంది వైద్యులు కూడా దీని బారినపడ్డారు. కరోనా కారణంగా చైనాలో అయితే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పరిశ్రమలు మూతబడ్డాయి. దీని ప్రభావం విదేశాల్లోను భయాందోళనలు కలిగిస్తోంది.

లండన్లోని చైనా టౌన్ గురువారం రాత్రికి ఖాళీ అయిపోయింది. అక్కడ మనుష్యులే కనిపించడం లేదు. కస్టమర్లు లేక హోటళ్లు - రెస్టారెంట్లు - షాప్స్ వెలవెలబోయాయి. రోడ్లపై కనీసం మాస్క్ ధరించి కూడా మనుషులు సంచరించడం లేదు. లండన్ లో ఓ మహిళకు కరోనా వైరస్ వచ్చిందని బుధవారం నిర్ధారణ అయింది. దీంతో చైనా టౌన్ ఖాళీ అయింది.

లండన్ లో తొలి కరోనా వైరస్ కేసు ఇది. బ్రిటన్ వ్యాప్తంగా మాత్రం ఇది తొమ్మిదో కేసు. వైరస్ సోకిన బాధితురాలిని దక్షిణ లండన్లోని గయ్ అండ్ సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. సాధారణంగా చైనా టౌన్ రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతుంటాయి. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా గుంపులుగా ఉండే హోటల్స్ - షాపులు - ఇతర పబ్లిక్ స్థలాల్లోకి ఎవరూ వెళ్లడం లేదు. వ్యాధి సోకిన విషయం తెలియగానే చైనా టౌన్ ఖాళీ అయింది.

కరోనా వైరస్ అనుమానంతో ఇప్పటి వరకు బ్రిటన్ కు చెందిన 2512 మందిని పరీక్షించి - వారిని పర్యవేక్షణలో ఉంచారు. కాగా కరోనా వైరస్ వచ్చినట్లుగా నిర్ధారించబడిన  బాధితురాలు చైనా నుండి వచ్చారు. గురువారం ఒక్కరోజే 750 మంది బ్రిటిషర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికి కూడా కరోనా వైరస్ సోకలేదని తేలింది.


× RELATED చైనా నుండి వచ్చిన యువతి - విశాఖలో కరోనా వైరస్ కలకలం