గడ్డు కాలంలో నాటి కింగ్ మేకర్లు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా నాయకులుగా ఎదిగారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేంత ఎదిగిన నాయకులు ఇప్పుడు రాజకీయ భవిష్యత్ కోసం పరితపిస్తున్నారు. నాడు ఓ వెలుగు వెలిగిని ఆ ఉద్ధండ నాయకులు ఇప్పుడు చడీచప్పుడు లేకుండా వారి సొంత పనులకే పరిమితమయ్యారు. రాజకీయాల్లో వారి ఇప్పుడు వినిపించడం లేదు. సైలెంట్ గా తమ పని తాను చేసుకుంటున్న నాయకులెవరో కాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఐదుగురు నాయకులు. పాలమూరు బిడ్డలు.. ప్రస్తుతం పరేషాన్ లో పడ్డారు.

వారే నాగం జనార్ధన్‍ రెడ్డి జూపల్లి కృష్ణారావు డీకే అరుణ పి. చంద్రశేఖర్‍ లక్ష్మారెడ్డి. వీరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రముఖ నాయకులు. జిల్లాలో వీరు చక్రం తిప్పేంత స్థాయిలో ఉన్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు వారు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. వీరంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా పని చేసిన వారే. రాజకీయాలను శాసించిన వారు. వీరిలో ముఖ్యమంత్రి పీఠం దాక చేరువైన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు సొంత జిల్లాలో వారి ఉనికి ప్రశ్నార్థకం మారింది.

తెలుగుదేశం పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి పి. చంద్రశేఖర్ ఉమ్మడి జిల్లాలో అత్యంత సీనియర్‍ నాయకులు. తెలుగుదేశం హయాంలో వీరిద్దరు ఐదుసార్లు మంత్రులుగా పని చేశారు. ఆ తర్వాత వారి పరిస్థితి మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై నాగం జనార్దన్‍ రెడ్డి నాగర్‍ కర్నూల్‍ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పి. చంద్రశేఖర్‍ మాత్రం రాజకీయాల్లో అంతగా లేరు. టీడీపీని వీడి మొదట టీఆర్‍ఎస్‍ పార్టీలో చేరారు. అక్కడ టికెట్‍ రాకపోవడంతో టీఆర్‍ఎస్‍ ను వీడి కాంగ్రెస్లో చేరారు. అక్కడా కూడా నిరాశే మిగిలడంతో బీజేపీలో చేరి ప్రస్తుతం ఆ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు.

ఒకప్పుడు కాంగ్రెస్‍ పార్టీలో సీనియర్‍ నాయకులుగా వైఎస్సార్ పాలనలో మంత్రులుగా జూపల్లి కృష్ణారావు డీకే అరుణ పని చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ ఇద్దరు కాంగ్రెస్ లో కీలక పదవులు పొంది ఒకరినొకరు సహకరించుకుంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగారు. కాలం మారింది.. వీరిద్దరూ కాంగ్రెస్ కు బై చెప్పేసి జూపల్లి టీఆర్‍ఎస్ లో చేరగా డీకే అరుణ బీజేపీలో చేరారు. అయితే ముందస్తు ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమి చెందారు. గద్వాల జేజమ్మగా పేరు పొందిన డీకే అరుణ ఓడడంతో అన్ని పార్టీల నాయకులు కూడా ఆవేదన చెందారు. మహబూబ్ నగర్ లోక్ సభకు పోటీ చేయగా నిరాశే ఎదురైంది. అయితే అరుణ బీజేపీలో రాష్ట్ర నాయకురాలిగా బిజీగా ఉన్నారు. అయితే జిల్లాలో మాత్రం పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేవు.

కొల్లాపూర్ లో ఓడిపోయిన తర్వాత జూపల్లి కృష్ణారావు పార్టీలో ఆయన పాత్ర తగ్గింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చేరడంతో టీఆర్ఎస్ లో చేరడంతో జూపల్లికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. కనీసం జూపల్లిని గుర్తించడం లేదు. ఈ పరిస్థితుల్లో జూపల్లికి కోపమొచ్చి ఇటీవల వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చూపారు. అత్యధిక స్థానాలు తన మద్దతుదారులను గెలిపించుకుని సత్తా చాటగా అది పార్టీ అధిష్టానానికి చెడ్డగా మారింది. పార్టీకి వ్యతిరేకంగా పని చేశావని ఆయనను పక్కకు పడేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ జూపల్లిని పొమ్మనలేక పొగబెడుతోంది.

ఇక మాజీమంత్రి లక్ష్మారెడ్డిని ఎవరూ గుర్తించడం లేదు. జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు అంతగా గుర్తింపు లభించడం లేదు. ఈ జిల్లా నుంచి మంత్రి పదవి అతడికి దక్కలేదు. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా లక్ష్మారెడ్డి పని చేశారు. మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో అవమానంగా భావించి కొంత పార్టీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర నిరాశతో ఆయన కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చక్రం తిప్పిన ఈ నాయకులు ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎలాంటి రాజకీయ ఆశలు లేకుండా జీవిస్తున్నారు. వారి ప్రభావం ఇప్పుడు పాలమూరు జిల్లాపై ఏమాత్రం లేదు. నాగం జనార్దన్ రెడ్డి పి. చంద్రశేఖర్ రాజకీయ జీవితం ముగిసినట్టేనని తెలుస్తోంది. జూపల్లి డీకే అరుణ లక్ష్మారెడ్డి కొన్నాళ్లు రాజకీయాల్లో రాణించే అవకాశం మాత్రం ఉంది. కాకపోతే పరిస్థితులు కలిసొస్తే కొనసాగుతారు.. లేదంటే అనధికారికంగా రాజకీయాల నుంచి వైదొలిగినట్టే.
× RELATED జగన్ దెబ్బకు..కుప్పంలో బాబు బస